చిన్న పిల్లలకు వ్యాక్సిన్, బూస్టర్‌ డోస్‌లపై కేంద్రం క్లారిటీ..

by Shamantha N |
చిన్న పిల్లలకు వ్యాక్సిన్, బూస్టర్‌ డోస్‌లపై కేంద్రం క్లారిటీ..
X

దిశ, న్యూఢిల్లీ: దేశంలో చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌తో పాటు, అర్హులకు బూస్టర్ డోసు ఇవ్వడంపై కేంద్రం శాస్త్రవేత్తల నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. శాస్త్రవేత్తల సూచన ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ‘నిపుణుల కమిటీ చిన్నపిల్లలకు టీకా, బూస్టర్ డోసు అవసరంపై నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై మేము శాస్త్రవేత్తల సలహాతో ముందుకు వెళ్తామ’ని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, భారత్‌లోనే అతితక్కువ గణాంకాలు నమోదయ్యాయని చెప్పారు.

ప్రతి 10 లక్షల మందిలో 25వేల మంది కరోనా బారిన పడగా, 340 మంది మరణించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.46కోట్ల మందికి వైరస్ సోకగా, 4.60లక్షలకు పైగా చనిపోయారని, మరణాల రేటు కూడా అతి తక్కువగా 1.36శాతం మాత్రమే ఉందని వెల్లడించారు. వ్యాక్సిన్, పరిశోధనల గురించి ప్రస్తావిస్తూ.. ఒకానొక సమయంలో వ్యాక్సిన్‌పై అధ్యయనం చేసి అనుమతులు ఇవ్వడానికి మూడేళ్లు పట్టేదని గుర్తుచేశారు. ప్రస్తుతం మోడీ తీసుకొచ్చిన కొత్త విధానాలతో కేవలం ఏడాదిలోనే వ్యాక్సిన్లకు అనుమతి లభిస్తుందని అన్నారు.

పంజాబ్‌లో ఆక్సిజన్ కొరతతో నలుగురు మృతి..

దేశంలో కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే నలుగురు ఆక్సిజన్ కొరతతో మరణించారని మాండవీయ తెలిపారు. శుక్రవారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఎంపీ బాలుభౌ ధనోర్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘మేము రాష్ట్రాలు అందించిన రాతపూర్వక నివేదికను కలిగి ఉన్నాం. 19 రాష్ట్రాలు అందించిన నివేదిక మేరకు, ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే ఆక్సిజన్ కొరతతో నలుగురు మరణించినట్లు నివేదిక ఉంది. మిగతా 18 రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో ఎలాంటి మరణం సంభవించలేదు’ అని తెలిపారు. సెకండ్ వేవ్ దేశంలో ప్రవేశించిన తర్వాత దేశంలో ఆక్సిజన్ లభ్యతపైనే రాజకీయాలు చేశారన్నారు.

‘మొదటి వేవ్ సమయంలో రోజుకు 1000 మెట్రిక్ టన్నుల నుంచి 1400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. రెండో వేవ్ సమయంలోనూ ఇదే మొత్తంలో సమకూర్చాం.విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకువచ్చి ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడానికి కృషి చేశాం. ప్రస్తుతం దేశంలో రోజుకు 4500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నామ’ని తెలిపారు. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే దేశంలో ఆరోగ్య సదుపాయాలు దయనీయంగా ఉన్నాయని మాండవీయ అన్నారు. మోడీ ప్రభుత్వం హయాంలోనే దేశంలో ఆరోగ్య సదుపాయాలు మెరుగుయ్యాయని వెల్లడించారు.

ప్రధాని తీసుకున్న నిర్ణయాల కారణంగానే మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అధికారంతో కాకుండా నమ్మకంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచ ఆకలి సూచి నివేదిక భారత వాస్తవ చిత్రాన్ని ప్రతిబింబించదని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పష్టం చేశారు. ఈ నివేదిక ప్రకారం స్కోర్‌లు 2000లో 38.8నుంచి 2021లో 27.5 శాతానికి మెరగయ్యాయని అన్నారు. గత కొన్నేళ్లుగా దేశం స్థిరమైన మార్పు కలిగి ఉందని తెలిపారు.

సరికొత్త చరిత్ర..

లోక్‌సభ చరిత్రలోనే అత్యధిక సమయం పాటు చర్చ జరిగిన రోజుగా డిసెంబర్ 2(గురువారం) చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని లోక్‌సభ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు స్పీకర్ శ్రీ ఓం ప్రకాష్ బిర్లా సభ్యులను అభినందించారు. ‘డిసెంబర్ 2న, సభ 204 శాతం ఉత్పాదకతను నమోదు చేసింది. ఇది లోక్‌సభ చరిత్రలో అత్యంత ఉత్పాదక దినంగా నిలిచింది. కోవిడ్-19 మహమ్మారిపై రూల్ 193 కింద 11 గంటల 3 నిమిషాల్లో 96 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్యాక్ ఏర్పడి 100 ఏళ్లు..

పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(ప్యాక్) ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం పార్లమెంటు ప్రధాన మందిరంలో రెండు రోజుల పాటు శతదినోత్సవ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ప్యాక్ చెర్మైన్ అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. రాజ్యసభ చెర్మైన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం‌బిర్లా ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. ప్యాక్‌ను 1921లో మోంటాగూ-చెల్మస్‌ఫోర్ట్ తీర్మానాల్లో తీసుకొచ్చారు. ఇందులో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కలిపి 22 మంది సభ్యులు ఉంటారు.

లోక్‌సభలో రెండు బిల్లుల ప్రవేశం

ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్(చట్టం) బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బిల్లును శనివారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ డైరక్టర్ల పదవీకాలాన్ని 5 ఏళ్ల పాటు పొడిగించేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అయితే దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇష్టానుసారంగా పదవీకాలాన్ని పొడిగించేందుకు ఈ బిల్లులు సహకరిస్తాయని ఆరోపించాయి.

రాజ్యసభలో కంపెనీల చట్టం బిల్లుపై చర్చ జరిగింది. చారిత్రక కట్టడాల నిర్వహణకు 25% సీఎస్ఆర్ నిధులను ఉపయోగించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. అయితే సీఎస్ఆర్ ఎందుకు ప్రవేశపెట్టారని ఎంపీ జైరాం ప్రశ్నించారు. ఈ బిల్లుతో సరైన ప్రయోజనాలు లేవని విమర్శించాయి. శుక్రవారం ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. సాయంత్రం కాసేపు చర్చ జరిగినప్పటికీ, ఇరు సభలను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.

Advertisement

Next Story