- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటిలోనే ప్రజా జీవనం..
గ్రేటర్ నీటిపై తేలియాడుతున్నది. భాగ్యనగరం ఘోల్లుమంటున్నది. రెండు రోజులుగా ముంపు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కనుకు లేదు. తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండిలేదు. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఏ కాలనీలో చూసినా వరద పరుగులే. ఏ ఇంట్లో చూసినా వాన తెచ్చిన కన్నీళ్లే. కష్టాల్లో తోడుగా ఉంటారనుకున్న కార్పొరేటర్లు కనీసం చూసేందుకు కూడా రావడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పిందే కానీ వరదను తట్టుకునే అభివృద్ధి మాత్రం చేయలేకపోయిందని జనం మండిపడుతున్నారు. పరామర్శలకు వచ్చే నాయకులపై తిరగబడుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : భారీ వానల కారణంగా నగరంలో 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. సుమవారు 20,540 ఇండ్లు నీట మునిగాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇక తాత్కలికంగా గుడిసెలు, ఇతర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి పరిస్థితి వర్ణణాతీతం. సిటీలోని అన్ని ఏరియాల్లోనూ ప్రజలు ఇళ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.. 20 ఏండ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్ మార్గాలు వరద కాలువలయ్యాయి. సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో దాదాపు 200 కాలనీలు జలమయమయ్యాయి. బోయిన్‌చెరువు తెగడం, హస్మత్‌పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు వంద కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, కొత్తపేట, బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, మీర్‌పేట, పాతబస్తీలోని పలు కాలనీలు గురువారం నీటమునిగి అల్లాడిపోతున్నాయి.
అత్యవసర సమయంలో..
హైదరాబాద్‌లో భారీ వర్షాలతో 20 మందికి పైగా మృత్యువాత పడినట్లు అధికారులు ధ్రువీకరించారు. భారీ వర్షాలతో చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. కొన్నిచోట్ల ఇళ్ల నుంచే వరద నీరు పరుగులు తీయడంతో ఆ ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయి విగతజీవులయ్యారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నా.. అంతగా ఫలితాలివ్వడం లేదు. ముఖ్యంగా పురాతన భవనాలు, నిర్మాణాల పక్కన నివసిస్తున్న వారు పునరావాస కేంద్రాలకు రావడానికి సిద్ధపడడం లేదు. ఓ సందర్భంలో స్వయంగా కేటీఆర్ సముదాయించి అక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిన ఘటన చోటు చేసుకుంది. ఒక వైపు వానలు, వరదలతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారి స్థిరనివాసాలను వదిలేందుకు సిద్ధంగా లేరు. సహాయక బృందాల సభ్యులకు, ప్రజలకు అంతకుముందు పరిచయం లేకపోవడంతో సహాయక చర్యలకు సహకరించడం లేదు. స్థానికులతో పరిచయం ఉన్న కార్పొరేటర్లయితే సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు వీలవుతుంది. వార్డులో అందరితో పరిచయాలు ఉండటం వల్ల భోజనాలు, మంచినీళ్లు అందించేందుకు, కార్పొరేటర్లు, స్థానికులు పరస్పరం అనుబంధం కలిగి ఉండటం వల్ల జీహెచ్ఎంసీ పనులు చేపట్టడం సులువు అవుతుంది.
కేటీఆర్, ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం
రెండు రోజులుగా వానలు కురుస్తున్న మందలించేవారు కరువయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకుని ఆహారం, నిద్ర లేకుంటే అష్టకష్టాలు పడుతున్నా సాయం చేసే చేతులు కనిపించడం లేదని వాపోతున్నారు. కరెంట్ లేక, భోజనం కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. వానలు తగ్గిన తర్వాత పరిస్థితిని పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలపైనా ప్రజలు తమ ఆగ్రహాన్ని ప్రకటించారంటే వారి ఆవేదనకు అద్దం పడుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్ గూడ చెరువు లోతట్టు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను స్థానిక ప్రజలు అడ్డుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో సాగర్ రింగ్ రోడ్డు పై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుండడంతో మంత్రి కేటీఆర్ అక్కడినుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. రామంతాపూర్ పెద్ద చెరువు పరిధిలోని ముంపు ప్రాంతాల్లో బోట్‌లో పర్యటించిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటామని, ఇంత నష్టం జరిగిన తర్వాత చనిపోయారా, బతికున్నారా చూడటానికి వచ్చారా అంటూ నిలదీశారు.
కార్పొరేటర్లేక్కడా..!
గ్రేటర్ పరిధిలో 150 వార్డుల్లో 79 మంది మహిళా కార్పొరేటర్లే ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లను టీఆర్ఎస్ గెలుపొందగా.. ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలుపుకుంటే ఈ సంఖ్య వందకు పైగా ఉంది. వరద సహాయక చర్యల్లో పాత బస్తీలోని కొందరు ఎంఐఎం కార్పొరేటర్లు, బీజేపీ మంత్రులు, నాయకులు అక్కడక్కడ పాల్గొని ప్రజలకు అండగా నిలిచారు. కార్పొరేటర్లలో మాత్రం ఎంఐఎం మినహా మిగిలిన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు పాల్గొనడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా 2/3 మెజార్టీ ఉన్న అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కనిపించడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే కార్పొరేటర్లు తాము వరదల్లో చిక్కుకొని అవస్థలు పడుతంటే పరామర్శించేందుకు కూడా రాలేదని మండిపడుతున్నారు.
మంత్రి ఆదేశించినా..
భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం ఉదయం హుటాహుటిన కేటీఆర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎల్‌బీ నగర్‌లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. మంత్రులు, కార్పొరేటర్లు కూడా వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. కేటీఆర్ స్వయంగా ఆదేశించినా పలువురు కార్పొరేటర్లు కదలనే లేదు. పరిస్థితి తీవ్రతను గమనించి పురపాలక శాఖ మంత్రి స్వయంగా రంగంలోకి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్లో మనోస్థైర్యం కలిగేంచేందుకు పని చేస్తుంటే.. గ్రేటర్ కార్పొరేటర్లలో చలనం లేకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మార్గనిర్దేశనం చేయడంలో కేటీఆర్ విఫలమవుతుండటంతో పాటు ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలవడంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు వెనుకబడ్డారనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.