కూరగాయల మార్కెట్లుగా మారిన సిటీ బస్సులు

by srinivas |   ( Updated:2020-04-03 04:16:01.0  )
కూరగాయల మార్కెట్లుగా మారిన సిటీ బస్సులు
X

బెజవాడలో సిటీ బస్సులు కూరగాయల మార్కెట్లుగా మారాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని వర్తకులు ధరలు పెంచి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్యలకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిష్కారం కనుగొంది.

విజయవాడ ప్రజల కూరగాయల ఇబ్బందులు తీర్చేందుకు విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ నడుం బిగించారు. నగరంలోని ఎక్కువమందికి కూరగాయలను అందించే ఉద్దేశంతో సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చారు. ఇందుకోసం డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిటీ బస్సుల్లో కూరగాయలు విక్రయించారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సంచార రైతు బజార్లకు విశేష స్పందన లభించింది.

దీంతో విజయవాడలోని 53 డివిజన్ల పరిధిలో సంచార రైతు బజార్ల ద్వారా ప్రజలకు కూరగాయలు విక్రయించాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఒక చోట గుమిగూడాల్సిన పరిస్థితి లేదని, తద్వారా కరోనాకు ప్రజలను దూరంగా ఉంచుతూనే, వారికి అవసరమైన కూరగాయలు వారికి లభ్యమయ్యేలా చర్యలు చేపట్టవచ్చని గుర్తించారు. తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయలు విక్రయించినట్టు అధికారులు తెలిపారు. దీనిని విజయవంతంగా నిర్వహించనున్నారు.

Tags: vijayawada muncipality, mobile vegitable market, mobile rythubazar, aps rtc, experiment

Advertisement

Next Story

Most Viewed