ఆలోచన, సహజత్వం కలగలిసిన ‘సినిమా బండి’

by Jakkula Samataha |   ( Updated:2021-05-17 01:28:15.0  )
ఆలోచన, సహజత్వం కలగలిసిన ‘సినిమా బండి’
X

దిశ, ఫీచర్స్ : పేరెంట్స్ ఎవరైనా తమకు తెలియని ఏదేని విషయంపై పిల్లల నాలెడ్జ్‌ చూసి అబ్బురపడుతుంటారు. తమ బాల్యం అలా లేనందుకు బాధపడుతూనే వారి తెలివితేటలను చూసి మురిసిపోతుంటారు. కానీ ఈ జనరేషన్‌లోనూ మౌలిక సదుపాయాలు లేని ఓ గ్రామం.. జీననోపాధికి వలసబాట పట్టిన యువకులు.. మార్పు కోసం ఎదురుచూసే జనాలు.. మార్పు మనమే తేవాలని ఆరాటపడే ఓ ఆటో డ్రైవర్. ఇల్లు, ఆటో తప్ప వేరే ప్రపంచమే తెలియని తనకు సినిమా తీయాలనే కోరిక కలగడం ఒక ఆశ్చర్యమైతే.. నెల తిరిగే సరికి ఆటో ఫైనాన్స్ కట్టేందుకు అపసోపాలు పడే తను.. నిజంగా సినిమా తీయగలిగాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న పర్యవసానాలేంటి? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే..

‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ ఫిల్మ్ మేకర్ ఎట్ హార్ట్’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘సినిమా బండి’. కర్ణాటక, ఆంధ్ర బార్డర్‌లో తారు రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి ఓ గ్రామంలో జరిగిన కథ. ఒక్క వారంలోనే కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అంటూ నిత్యం టీవీల్లో వచ్చే వార్తలు.. తాను, తన చుట్టూ ఉన్నవారు అనుభవిస్తున్న జీవితం.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా? మన బతుకులు మారొద్దా? అనే తెగింపు ఒక ఆటోడ్రైవర్‌ను సినిమా తీసేందుకు ముందుకు నడిపించగా.. మనసు పెడితే అందరూ ఫిల్మ్ మేకర్స్ అనే విషయాన్ని నిరూపించింది ‘సినిమా బండి’. ఇక ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉందని చెప్పే కంటే అమాయకపు పల్లె జనాల ఆత్మను నిర్వచించింది అంటేనే కరెక్ట్. ఎందుకంటే ప్రతీ సీన్, డైలాగ్‌లోనూ విలేజ్ అట్మాస్పియర్, లొకాలిటీ ఫ్లేవర్ అద్దం పడుతూ రియల్ లైఫ్ రిలేటివిటీని తెరపై ఆవిష్కరించింది. సినిమా హిట్ అయితే వచ్చే డబ్బుతో ఊరిని బాగు చేయాలనే ఆటోడ్రైవర్ పాత్ర.. తను పుట్టి పెరిగిన గడ్డపై ప్రేమను చాటింది.

కథ విషయానికొస్తే.. ఎవరో ప్యాసింజర్ సోనీ హై ఎండ్ వీడియో కెమెరాను వీరా(ఆటోడ్రైవర్) ఆటోలో మరిచిపోతారు. దాన్ని ఇంటికి తెచ్చిన వీరా.. కెమెరామెన్ అయిన తన ఫ్రెండ్‌కు చూపించి ఏం చేయాలో సలహా అడుగుతాడు. చాలా డిస్కషన్స్ తర్వాత ఆ కెమెరాను ఉపయోగించి తామే సొంతంగా సినిమా తీయాలని డిసైడ్ అవుతారు. ఇలా టైటానిక్ ఫొటో షూట్స్‌తో ఫేమస్ అయిన తన ఫ్రెండ్ కెమెరా మ్యాన్‌‌‌గా, వీరా డైరెక్టర్‌గా మారి ఓ ముసలాయన(తాత) అందించిన కథను పట్టుకుని హీరో హీరోయిన్ల కోసం సెర్చింగ్ మొదలుపెడతారు. అలా ఓ బార్బర్ షాప్ యువకుడు హీరోగా, మరో కాలేజీ అమ్మాయిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలో వారు షూటింగ్ కష్టాలతో పాటు ఊరి జనం నుంచి సూటిపోటి మాటలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమంగా వీళ్లు పడుతున్న కష్టాలు చూసి గ్రామస్తులు సైతం సాయపడేందుకు ముందుకొస్తారు. ఇది మా ఊరి సినిమా అని ఫీల్ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి షూటింగ్ ఎక్విప్‌మెంట్ లేకుండా, కేవలం ఒకే ఒక్క కెమెరాతో సీన్లు చిత్రీకరించేందుకు టీమ్ అంతా పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. ఆటోలో రౌండ్ ట్రాలీ షాట్లు, ఎడ్ల బండిని ఉపయోగించి కెమెరా ఎఫెక్ట్స్ క్రియేషన్ చూస్తే.. ఇలా కూడా చేయొచ్చా అనే ఆలోచన రేకెత్తిస్తుంది. ఇక షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చే దశలో కెమెరా పాడవడం, రిపేర్ చేయిస్తున్న క్రమంలో కెమెరా ఓనర్స్ వచ్చి పట్టుకెళ్లి పోవడంతో నిరాశతో కృంగిపోతారు. ఈ నేపథ్యంలో సినిమా కంప్లీట్ చేశారా? లేదా అన్నది మిగతా కథ..

బాలీవుడ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని నిర్మించగా.. యువ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. ఏ మాత్రం ఆర్టిఫిషియల్ అంశాల జోలికి పోకుండా, తాము అనుకున్న కథను పక్కాగా తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. నేపథ్య సంగీతం కథలో లీనమయ్యేలా చేస్తుంది. విమర్శనాత్మక కోణంలో చూస్తే తప్పులు దొరికే అవకాశమున్నా.. నిజానికి ఇది కమర్షియల్ సినిమా కాదు. మూవీ చివరలో చెప్పినట్టు ‘తాత రాసిన టైటానిక్’. కాబట్టి హార్ట్‌ఫుల్‌గా చూసి, వీరి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

మేకర్స్ : రాజ్ అండ్ డీకే
డైరెక్టర్ : ప్రవీణ్ కండ్రేగుల
స్టారింగ్ : వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి
మ్యూజిక్ : సత్యవోలు శిరీస్, వరుణ్ రెడ్డి
స్ట్రీమింగ్ : నెట్‌ఫ్లిక్స్

Advertisement

Next Story