ఆ వైసీపీ ఎమ్మెల్యే సింహాంలాంటోడు.. సీఐ పొగడ్తల వర్షం

by srinivas |   ( Updated:2021-09-29 06:04:09.0  )
ఆ వైసీపీ ఎమ్మెల్యే సింహాంలాంటోడు.. సీఐ పొగడ్తల వర్షం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆయనో పోలీస్ ఆఫీసర్. ప్రజలను రక్షించే రక్షకభటుడు. అలాంటి ఆ అధికారి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు ఎమ్మెల్యే సింహంలాంటోడంటూ తెగ పొగిడేశారు. ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆసక్తికర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఓ జిమ్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక సీఐ రాముతోపాటు ఇతర నాయకులు హాజరయ్యారు. జిమ్ ప్రారంభోత్సవం పూర్తైన తర్వాత సీఐ రాము మాట్లాడారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై ప్రసంశల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే సింహంలాంటోడంటూ తెగ పొగిడేశారు. సింహానికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయని ఆ నాయకత్వ లక్షణాలు వెంకట్రామిరెడ్డిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వెంకట్రామిరెడ్డి మంచి నాయకుడని..ప్రజలు అడగకముందే అన్ని పనులు చేస్తుంటారని చెప్పుకొచ్చారు. వంద గొర్రెలకు సింహాన్ని నాయకుడిని చేస్తే ఆ గొర్రెలు కూడా సింహంలా తయారవుతాయని అలాంటి సింహం వెంకట్రామిరెడ్డి అని చెప్పుకొచ్చారు. యూనిఫాంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి ఒక ఎమ్మెల్యేను ఇలా పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సీఐ రాము వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Advertisement

Next Story