- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'చౌరస్తా'లో పాట.. ఆ నలుగురు నోట
దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ప్రయాణం కొత్త పాఠాన్ని నేర్పిస్తుందంటారు. ఒక్కోసారి ఆ ప్రయాణం ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తే… ఒక్కోసారి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.. రెండోదే జరిగిందిక్కడ. అలా నలుగురు స్నేహితుల్లో ఒకరి ఆలోచన వారి జీవితాలనే మార్చేసింది. ప్రపంచానికి వారిని పరిచయం చేసింది… సరికొత్తగా ఆవిష్కరించుకునేలా చేసింది. చౌరస్తా బ్యాండ్ పేరుతో తెలుగు రాష్ట్రాలకు అచ్చమైన సంగీతాన్ని అందించే దిశగా అడుగులు వేయించింది.
సింగర్, మ్యూజిక్ కంపోజర్, లిరిక్ రైటర్ రామ్, గిటారిస్ట్ శ్రీనివాస్, సింగర్, మ్యూజిక్ కంపోజర్ యశ్వంత్, సింగర్ బాలాజీ ఈ నలుగురు కలిసి రేడియో మిర్చిలో పనిచేసే వారు. వీరిలో యశ్వంత్, శ్రీనివాస్ హిమాలయాల ట్రిప్ వెళ్లినప్పుడే ఈ బ్యాండ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందట. యశ్వంత్ , శ్రీనివాస్ ఇద్దరు పాటలు పాడుకుంటుండగా.. శ్రీనివాస్ చెప్పాడట మనం ఇంత బాగా పాడుతున్నాం కదా మనం ఎందుకు బ్యాండ్ ఏర్పాటు చేయొద్దని. ఆ ఆలోచనను నలుగురు మిత్రులు ఆమోదించడంతో చౌరస్తా బ్యాండ్ తెరపైకి వచ్చింది.
సాదాసీదాగా కాదండోయ్… వీరలెవల్లో దూసుకొచ్చింది. వారి జీవితం, జీవనశైలి సంగీతమే కావడంతో… సూపర్ సక్సెస్ అయింది చౌరస్తా. సమాజం తీరు, సమస్యలే లిరిక్స్ కాగా… జనానికి అర్ధమయ్యే రీతిలో పాటలను కంపోజ్ చేస్తుండడంతో అతికొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సింపుల్ అండ్ క్యాచీ పదాలను ఉపయోగించే బ్యాండ్… రెగ్గి మ్యూజిక్, జానపద పాటలతో సూపర్ ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. వినూత్నంగా, వైవిధ్యంగా పాటలు అందించడంలో సూపర్ సక్సెస్ అయింది. హాలీవుడ్ సింగర్ బాబ్ మార్లే, తెలుగులో గోరేటి వెంకన్న మాకు ఆదర్శం అని చెబుతున్న చౌరస్తా బ్యాండ్ టీం… ఆ ఇద్దరు కలిస్తే ఎంత హుషారైన పాటలు అందించవచ్చో అంతకు మించిన జోష్ ఉన్న పాటలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ నలుగురు స్నేహితులకు తోడు డ్రమ్మర్ అక్షయ్, బేస్ గిటారిస్ట్ అనంత్ జతకలవడం… చౌరాస్తా బ్యాండ్ లైవ్ షోస్‌కు మరింత రెస్పాన్స్ వచ్చేలా చేసింది.
చౌరస్తా బ్యాండ్ … ప్రజల కోసమే సంగీతం అందిస్తుందని చెబుతున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా మా పాట ఉంటుందంటున్నారు. రెగ్గీ మ్యూజిక్, ఫోక్ కలగలిపి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకున్నామని తెలిపిన చౌరస్తా…. మా లక్ష్యం ప్రజలకు సంగీతాన్ని అందిచడమేనని చెబుతున్నారు. ఈ రోజు ఉన్న క్రేజ్ రేపు ఉంటుందో లేదో తెలియదు కానీ… ప్రజల్లో ప్రతీ విషయంలో తమ పాటలతో అవగాహన కల్పించాలనుకున్న మా ఉద్దేశం మాత్రం ఆగిపోదన్నారు. మా పని మేము చేసుకుంటూ పోతామని చెబుతున్నారు.
‘మాయా మాయా… మాయా… పోరి మాయారే…’ లాంటి పాటతో కుర్రకారులో జోష్ నింసిన చౌరస్తా బ్యాండ్… ‘లాయిలో లల్లాయి లాయిలో’ అంటూ బ్రేకప్ సాంగ్‌తో బ్రేకప్ కష్టాలను క్యాచీ వేలో అందించింది. ‘ఊరెళ్లిపోతా మామ.. ఊరెళ్లి పోతా మామ…’ పాట ద్వారా ఊరు మారిన తీరు వివరించారు. మనసున్న పల్లె జనం వలసల్లో చేదిరిపోయారు లాంటి పదాలు కన్నీరు పెట్టిస్తాయి. మొత్తానికి రైతుల గోసను ఏకరువు పెట్టాలన్నా… ప్రేమికుల కష్టాలను స్పష్టంగా, సులభంగా చెప్పాలన్నా చౌరస్తా బ్యాండ్‌కే చెల్లింది.
ఇక కరోనా ఎఫెక్ట్ ఉన్నా లాక్‌డౌన్ పాటించకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన చౌరస్తా బ్యాండ్… ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా… కాళ్లుగూడ మొక్కుతా అడుగు బయటవెట్టకురా’ అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. అదే ఊపుతో లాక్ డౌన్ టైంలో భర్తల కష్టాలు కామిక్ వేలో తెలుపుతూ ‘మిస్టర్ పెళ్లాం’ సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ పాట కోసం వర్క్ ఫ్రమ్ హోం చేసింది చౌరస్తా బ్యాండ్ టీం.
చౌరస్తా బ్యాండ్ పాటలు గుండెలు పిండేలా ఉంటాయని చెబుతారు ప్రేక్షకులు. పాట ఇంకొంచెం ఉంటే బాగుండేది కదా అనిపిస్తుందట. వారి పాటల్లో ఉన్న ఆంతర్యం సులభంగా అర్థమవుతుందని… ఆ పాట వింటే మనుషుల్లో మార్పు వస్తుందని చెబుతారు. సంస్కృతి, భాష, మాండలికాలకు అనుగుణంగా సంగీతం అనేది పుట్టుకొస్తే మంచి ప్రాచుర్యం పొందుతుందని చెప్పడానికి చౌరస్తా బ్యాండ్ చక్కటి ఉదాహరణ అంటున్నారు.