- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘరానా ‘చిట్‌ఫండ్’ చీటింగ్.. రోడ్డెక్కిన బాధితులు
దిశ, గోదావరిఖని : కుటుంబ భవిష్యత్ ఆధారాలను దృష్టిలో ఉంచుకొని పొదుపు చేసుకుందామనుకున్న సామాన్యుల ఆశలను కొంతమంది వారికి అవకాశంగా మలుచుకుంటున్నారు. చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసుకొని ఉడాయిస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో, భవిష్యత్ అవసరాలకు డబ్బు ఆసరాగా అవుతుందని భావించిన సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రూపాయి.. రూపాయి పొదుపు చేసి పిల్లల చదువులకు, ఇంట్లో అవసరాల కోసం చిట్టీలు వేస్తే.. కొంత మంది మోసం చేయడంతో డబ్బులు పొదుపు చేసుకున్న వారి పరిస్థితి దిక్కుతోచకుండా పోతున్నది.
ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేట్ చిట్‌ఫండ్‌లలో చిట్టీలు వేసిన సమయానికి డబ్బులు ఇవ్వకుండా తమ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటూ ఉండటంతో బాధితులు ఉసూరుమంటున్నారు. కొన్ని నెలల కిందట గోదావరిఖని ఎన్టీపీసీలోని ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో చిట్టీ ఎత్తుకొని సంవత్సరాలు గడుస్తున్నా తమకు డబ్బులు చెల్లించడంలేదని బాధితులు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ చిట్‌ఫండ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొంత మందికి సమయానికి డబ్బులు చెల్లించకుండా సదరు చిట్‌ఫండ్ నిర్వాహకులు తమ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే గోదావరిఖని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉండే చిట్‌ఫండ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి పలువురు దగ్గర చిట్టీలు కట్టించుకొని డబ్బులు అడిగే సరికి నాకు సంబంధం లేదు. చిట్‌ఫండ్ ఆఫీసులో అడగండి అని బెదిరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చిట్‌ఫండ్ సంస్థ వారితో తనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మొదట చెప్పి.. తీరా చిట్టీలు వేశాక డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా ప్రతీరోజూ ఎన్నో ఘటనలు జరుగుతున్నా సంబంధిత చిట్‌ఫండ్‌పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కొంతమంది అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిట్‌ఫండ్‌పై కరీంనగర్ రిజిస్టార్‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. సాధారణంగా చిట్టీల నిర్వహణ జరగాలంటే నాన్ బ్యాంకింగ్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఒకవేళ డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ అనుమతి పొంది ఉండాలి. ఇలా పొందిన కొన్ని సంస్థలు కూడా సమయానికి బాధితులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొంతమంది చిట్టీల నిర్వాహకులు తమకున్న రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకొని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. ఇలాంటి చిట్‌ఫండ్ నిర్వాహకులపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తు్న్నారు.