ప్రధానిని కలిసిన చిన్నజీయర్ స్వామి

by Shyam |
ప్రధానిని కలిసిన చిన్నజీయర్ స్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించేందుకు చిన్న జీయర్ స్వామి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు హాజరుకావాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి.. శనివారం ప్రధాని మోడీని కలిశారు. ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వానపత్రికను అందించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రధానిని చిన్నజీయర్ స్వామి కోరారు. ఆయనతో పాటు మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు సైతం ప్రధానిని కలిశారు.

ఈ సందర్భంగా పలు ప్రాజెక్టు విశేషాలను ఆయనకు వివరించారు. ఇదిలా ఉండగా సమతాస్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను వారిని అడిగి మోడీ తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. విగ్రహావిష్కరణకు తప్పకుండా వస్తానని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామానుజాచార్య పంచలోహ విగ్రహం కొలువుదీరుతుండడంతో శంషాబాద్‌‌లోని ముచ్చింతల్‌ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ఈ మహోత్సవం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed