ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగబోం: వివో

by Shyam |
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగబోం: వివో
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మార్గం సుగమం అయ్యిందని అటు బీసీసీఐ, ఇటు క్రికెట్ అభిమానులు ఆనందడోలికల్లో మునిగిన తరుణంలో చైనా కంపెనీ దెబ్బ తీసింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగబోమని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ వేచి చూసిన వీవో మాతృసంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బీసీసీఐకి శరాఘాతంలా మారింది. ఇండో-చైనా ఘర్షణ నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, సంస్థలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో చైనా యాప్స్‌ను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. బీసీసీఐ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వీవో చైనా కంపెనీ కావడంతో దానితో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ క్రమంలో బీసీసీఐ స్పందిస్తూ తాము ప్రజల సెంటిమెంట్‌ను బట్టే నడుచుకుంటామని, ప్రభుత్వం కోరితే వీవోతో ఒప్పందం రద్దు చేసుకుంటామని ఏకంగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వ్యాఖ్యానించారు. అయితే, గత ఆదివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఐపీఎల్ స్పాన్సర్‌గా వీవోను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. కానీ, అనూహ్యంగా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఐపీఎల్‌పై పూర్తి నిర్ణయాలు తీసుకొని, భారత ప్రభుత్వ అనుమతులు పొందిన రెండు రోజుల తర్వాత వీవో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది.

ఇది బీసీసీఐ తప్పేనా?

ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో చైనా కంపెనీలపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ రద్దు చేసుకోవాలని వీవో మాతృసంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ భావించింది. ఈ మేరకు విషయాన్ని బీసీసీఐ పెద్దలకు కూడా చెప్పింది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవద్దని, స్పాన్సర్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయినా సరే వీవో స్పాన్సర్‌షిప్ ఒప్పందం నుంచి వైదొలగడానికే మొగ్గు చూపింది. దీంతో ఒప్పందంలోని షరతులను బీసీసీఐ చూపించింది. అర్ధాంతరంగా వైదొలిగితే బ్యాంకు గ్యారంటీ కూడా రాదని, పైగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. గతంలో ఇలాగే ఐపీఎల్ ఒప్పందాల నుంచి అకస్మాతుగా వైదొలగిన వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యూఎస్‌జీ) బీసీసీఐకి రూ.800 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. దీన్ని కూడా ఉదాహరణగా చూపించినట్లు తెలుస్తున్నది. బీసీసీఐ పలు వైపుల నుంచి ఒత్తిడి చేయడంతో వీవో తమ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పింది. అయితే, తమంతట తామే తప్పుకుంటామని వీవో ముందే చెప్పినా బీసీసీఐ ఒప్పుకోలేదు. ఇది కచ్చితంగా బోర్డు తప్పేనని, వీవో అభ్యర్థించిన వెంటనే అంగీకరించి ఉంటే కాస్త పరువైనా దక్కేదని విశ్లేషకులు అంటున్నారు.

అసలు కారణం ఇదేనా..

కరోనా నేపథ్యంలో క్రీడా సంస్థలు భారీ ఆదాయాన్ని కోల్పోయాయి. వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి బోర్డులు స్పాన్సర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. టీం ఇండియా కిట్ స్పాన్సర్‌గా ఉన్న నైకీ కూడా ఒప్పందాన్ని కొనసాగించేందుకు విముఖత చూపించింది. ఇలాంటి సమయంలో ఉన్న స్పాన్సర్‌ను వదిలించుకొని కొత్త వాళ్లను వెతకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా వీవో ఇచ్చినంత స్థాయిలో డబ్బు ఇవ్వకపోవచ్చు అనే అనుమానంతోనే ఈ ఒప్పందాన్ని బీసీసీఐ కొనసాగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా టైటిల్ స్పాన్సర్ తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త భాగస్వామిని వెతుక్కోక తప్పదు.

Advertisement

Next Story