అలీబాబా అధినేత జాక్ మా కనబడుటలేదు!

by Harish |
అలీబాబా అధినేత జాక్ మా కనబడుటలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు అలీబాబా ఇటీవల ప్రభుత్వాల నుంచి అనేక చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన గత రెండు నెలల నుంచి బాహ్య ప్రపంచంలో కనిపించడంలేదని వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇటీవల పరిణామాల్లో జాక్ మా సంస్థలను చైనా ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అలీబాబా గుత్తాధిపత్యం నిబంధనలను చూపించి దర్యాప్తును కూడా చేపట్టాయి. ఈ మధ్యనే యాంట్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై దర్యాప్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే జాక్‌మా గత రెండు నెలలుగా ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలీదు. రెండు నెలలకు ముందు చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్ రంగం గురించి ఆయన ప్రభుత్వానికి సలహాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వ్యాఖ్యల వల్లనే ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

తర్వాత నవంబర్‌లో జాక్ మా నిర్వహించే ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ అనే టాలెంట్ షో చివరి ఎపిసోడ్‌కు జడ్జీగా రావాల్సి ఉండగా, హాజరుకాలేదు. ఆయనకు బదులుగా అలీబాబా ఎగ్జిక్యూటివ్ పాల్గొన్నారు. దీంతోపాటు టాలెంట్ షో అధికారిక వెబ్‌సైట్‌లో జాక్ మా ఫోటోలను కూడా తొలగించారని తెలుస్తోంది. అలీబాబా సంస్థ ప్రతినిధులు మాత్రం టాలెంట్ షో షెడ్యూల్‌లో సమస్య ఉండటం వల్లనే రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు జాక్ మా ఎవరికీ కనబడకుండా పోవడంతో ఏమయ్యాడనే అనుమానం అందరిలో తొలిచేస్తోంది.

కాగా, అక్టోబర్ చివరి వారంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన జాక్ మా..ఆర్థికవ్యవస్థలో ఉన్న లోపాలను, బ్యాంకులు తాకట్టు విధానాలను విడిచి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. అప్పట్లో జాక్ మా వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి విమర్శలు మొదలయ్యాయి. వెంటనే జాక్ మా వ్యాపారాలపై నిఘా పెరిగింది. దీనికితోడు జాక్ మాకు మూడో వంతు వాటా ఉన్న యాంట్ గ్రూప్ ఐపీవోను సైతం అడ్డుకున్నారు. అదేవిధంగా, యాంట్ గ్రూపునకు రావాల్సిన ప్రభుత్వ ప్రాజెక్ట్‌ను బీజింగ్ అధికారులు ఆపేశారని, ఇది జిన్ పింగ్ ఆదేశాలతోనే జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అలీబాబా గ్రూపుపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో జాక్ మా చైనాను విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. క్రిస్మస్ సందర్భంగ యాంట్ గ్రూప్ సంస్థ అన్ని కార్యకలాపాలను ఆపేయాలని బీజింగ్ ఆదేశించింది.

Advertisement

Next Story