అమర జవాన్లనూ పట్టించుకోని చైనా

by vinod kumar |
అమర జవాన్లనూ పట్టించుకోని చైనా
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా, చైనా సరిహద్దు వివాదంలో సైనికుల మధ్య ఘర్షణ జరిగి, దాదాపు 20 మంది భాతర సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు యావత్ దేశం సెల్యూట్ చేసింది. ప్రభుత్వాలు సైనికుల అంతిమయాత్రలు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికి.. ఘనంగా నివాళి అర్పించాయి. సైనికుల కుటుంబాలకు మేమున్నాం.. అని భరోసాను ఇచ్చి, ఆదుకున్నారు. కానీ అదే చైనా విషయానికొస్తే.. ఇప్పటివరకూ గల్వాన్ ఘర్షణలో చనిపోయిన చైనా జవాన్ల వివరాలను ఆ దేశ ప్రభుత్వం ఇప్పటివరకూ బయటపెట్టలేదు. ఎంత మంది చనిపోయారన్న వివరాలను చెప్పకున్నా.. కనీసం తమ దేశ అమర వీరులనైనా గౌరవించాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ చైనా అది కూడా చేయలేదు.

ఆ బాధిత సైనిక కుటుంబాలను చైనా ప్రభుత్వం ఇప్పటివరకూ వాళ్ల వద్దకు వెళ్లలేదు, ఓదార్చలేదు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయకపోగా.. వ్యక్తిగత సంప్రదాయ పద్దతిలోనూనూ అంత్యక్రియలు జరపకూడదని కుటుంబసభ్యులను ఆదేశించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఓ ఇంటిలిజెన్స్‌ సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు సుమారు 35 మంది మరణించినట్టు తెలిపింది. అయితే అమర వీరులకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించకూడదని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలిసింది. అంతేకాదు, అందరినీ ఒకేసారి ఖననం చేయాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.

చైనా ప్రభుత్వం తీరుపై సదరు సైనికుల కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమరవీరులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశాయి. వారికి సమాధానం చెప్పలేని డ్రాగన్ ప్రభుత్వం.. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఐతే గల్వాన్ లోయలో మరణించిన చైనా సైనికుల సంఖ్య బహిర్గతమైతే తమ దేశానికి చెడ్డ పేరు రావడంతో పాటు పరువు పోతుందన్న కారణంతోనే.. ఇలా చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తీరుపై ఆ దేశ పౌరులు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed