రెడీ అవుతున్న చైనా హ్యాకర్లు!

by Harish |
రెడీ అవుతున్న చైనా హ్యాకర్లు!
X

భారత్ – చైనా మధ్య సరిహద్దు వివాదాల్లో జవాన్లు మరణించిన తర్వాత భారతీయులు చైనా ఉత్పత్తులను నిషేధించాలంటూ విప్లవాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనికి దీటుగా చైనీయులు కూడా ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాళ్లు హ్యాకింగ్‌ను ఆయుధంగా ఎంచుకున్నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరికలు కూడా జారీచేశాయి. జూన్ 21 తేదీ నుంచి చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలపై ఈ చైనా ఆర్మీ హ్యాకర్ గ్రూప్‌లు దాడి చేయబోతున్నాయని సమాచారం.

పెద్దమొత్తంలో చైనా హ్యాకర్లు భారత కంపెనీలు, వ్యక్తుల మీద దాడి చేస్తారని సెర్ట్ ఇండియా కూడా భారత సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ దాడులకు కూడా చైనా కొవిడ్ 19నే అస్త్రంగా వాడబోతోందని సెర్ట్ ప్రకటించింది. చైనీస్ సైబర్ వారియర్ల దగ్గర దాదాపు 20 లక్షల భారతీయుల ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నాయని, ఉచిత కొవిడ్ 19 పరీక్ష పేరుతో మెయిల్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియా బుల్స్ వంటి సంస్థను హ్యాక్ చేసి, 24 గంటల్లో సమాచారాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు చైనా హ్యాకర్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంపిస్తున్నట్లుగానే గవర్నమెంట్ ఐడీలతో వచ్చే మెయిళ్ల నుంచి జాగ్రత్త వహించాలని, ఏదైనా మెయిల్‌ను ఓపెన్ చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సైబర్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

Advertisement

Next Story