కేసీఆర్‌కు కమీషన్ల కక్కుర్తే తప్ప.. రైతు సమస్యలపై సోయి లేదు : షర్మిల

by Shyam |
YS Sharmila
X

దిశ, గజ్వేల్: తెలంగాణలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్యలేనని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు చింతల స్వామి కుటుంబాన్ని షర్మిల పరామర్శించి, ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ఉన్న లోపాల మూలంగానే ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులు మరణించారని, రైతన్నలకు మేలు చేయని ధరణి ఎందుకని ప్రశ్నించారు. భూ సమస్యలు పరిష్కారం అవ్వక రాష్ర్టంలో చాలామంది రైతులు ఉసురు తీసుకుంటున్నారని, ఇంకా ఎంతమంది రైతులు అసువులు బాసితే సమస్యలు పరిష్కారమవుతాయో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిగ్గులేదని, ఇప్పటికే కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో మింగి, అయినా చాలనట్లు రైతుల భూములపై కన్నేశాడని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి కమీషన్ల మీద కక్కుర్తే తప్ప, రైతుల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గడ్డమీదనే ఏడాది నుంచి భూ సమస్యలు పరిష్కారం కాకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్య పరిష్కారం కాదనే రైతు స్వామి ఆశలు వదులుకొని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. వెంటనే స్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామి భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.

Advertisement

Next Story