‘నల్సర్‘ స్థలం వాపస్ తీసుకోండి.. గచ్చిబౌలిలో ఇవ్వండి : కేసీఆర్‌ను కోరిన సీజేఐ రమణ

by Shyam |
‘నల్సర్‘ స్థలం వాపస్ తీసుకోండి.. గచ్చిబౌలిలో ఇవ్వండి : కేసీఆర్‌ను కోరిన సీజేఐ రమణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్సర్ విశ్వవిద్యాలయం సమీపంలో మంజూరైన పది ఎకరాల స్థలాన్ని వాపసు తీసుకుని గచ్చిబౌలిలో తగిన స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక సంస్కరణల కారణంగా మన దేశానికి అనేక అంతర్జాతీయ సంస్థలు, వాటివెంట పెట్టుబడులు వస్తున్నాయని, ఆర్బిట్రేషన్ కేంద్రాల ఆవశ్యకత ఉన్నదని పేర్కొన్నారు. అలాంటి కేంద్రం రావాలన్నది తన దీర్ఘకాల స్వప్నమని, ఇప్పటికి అది సాకారమవుతున్నదని, దీని ఏర్పాటు కోసం ట్రస్ట్ డీడ్ ఒప్పందం జరిగిందని పేర్కన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమం సందర్భంగా సుప్రీంకోర్టు సీజే పై వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ పారిశ్రామిక వివాదాల పరిష్కారంలో ఈ ఆర్బిట్రేషన్ కేంద్రంతో తొలి అడుగు పడిందని, ఇకపైన దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేవారు ఆ తర్వాత తలెత్తే లిటిగేషన్‌లతో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారని, వాటిని పరిష్కరించేందుకే ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు అని సీజేఐ అన్నారు.

దేశంలోనే ఇది తొలి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రమని, ఇకపైన కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని, సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. వివాదాల పరిష్కారానికి కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ట్రస్ట్ డీడ్‌ రిజిస్ట్రేషన్‌తో మొదలైన ఈ ప్రక్రియ రెండు, మూడు నెలల్లో వినియోగంలోకి వస్తుందని, తన కల నెరవేరుతున్నదన్నారు. పీవీ నర్సింహారావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలకు బీజం పడిందని, అందులో భాగంగానే 1996లో ఆర్బిట్రేషన్ చట్టం ఉనికిలోకి వచ్చిందని గుర్తుచేశారు. చాలా పరిశ్రమలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని, కానీ ఆర్బిట్రేషన్ కేంద్రం ఉందో లేదోననే ప్రశ్నతోనే వారి ప్రయత్నాలు మొదలవుతున్నాయని గుర్తుచేశారు.

భారత దేశ చట్టాలపై గౌరవం, విశ్వాసం ఉన్నప్పటికీ లిటిగేషన్ల పరిష్కారం కోసం ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధను నివారించడానికి ఆర్బిట్రేషన్ సెంటర్‌ ఉండాలని కోరుకుంటున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లితో పాటు సుప్రీంకోర్టు జడ్జీ లావు నాగేశ్వరరావు, మంత్రి కేటీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story