మంత్రి కొప్పులకు సీఎం తనయ వినతి..

by  |   ( Updated:2021-06-15 08:19:11.0  )
kavitha-mlc -1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆమె సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు. ఎమ్మెల్సీగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. రాజు తలుచుకుంటే ఎదైనా సాధ్యమే. అందులోనూ కేసీఆర్ గారాలపట్టి కావడంతో వరాల జల్లు కురిపించే అవకాశం ఆమెకు కూడా ఉంది. కానీ, అందుకు భిన్నంగా ఆమె ప్రసంగం సాగడం అందరినీ ఆశ్చర్య పరిచింది. నాన్నతో మాట్లాడి మంజూరు చేయిస్తానని మాత్రం ఆమె ప్రకటించలేదు. ఆ బాధ్యతలను పక్కనే ఉన్న మంత్రిపై వేసేశారు ఆవిడ. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..?

మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… జిల్లాలోని 3 మండలాల్లో లైబ్రరీలు లేవని, దీంతో అక్కడ మంజూరు చేసేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషి చేయాలన్నారు. అలాగే జగిత్యాలలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయించాలని మంత్రి కొప్పులను రిక్వెస్ట్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయ ఓ మంత్రిని కోరడం ఇక్కడ చర్చకు దారి తీసింది.

సంచలన వ్యాఖ్యలు..

రానున్న రోజుల్లో పెను మార్పులు సంభవించనున్నాయని, ఏం జరిగినా టీఆర్ఎస్‌కే అనుకూలంగా మారుతాయని కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అయితే, ఆ మార్పులు రాజకీయంగా చోటుచేసుకోనున్నాయా..? ఇతరత్రా ఏమైనా ఉందా.. అనే విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed