అయ్యో పాపం అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇచ్చారో.. అంతే సంగతులు

by srinivas |   ( Updated:2021-06-27 05:58:08.0  )
cheating women arrested
X

దిశ, ఏపీ బ్యూరో: రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉంటుంది. రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపుతుంది. తాను అర్జెంట్‌గా వెళ్లాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తోంది. కొన్ని సార్లైతే అవతలివారు జాలిపడేలా ఏడుస్తూ తెగ నటిస్తుంది. అయ్యో పాపం ఆడపిల్ల..అందులోనూ ఒంటరిగా ఉందే అని జాలి పడి ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారో వారు ఇక అడ్డంగా బుక్కైనట్లే. కొంత దూరం వెళ్లాక జనాల రద్దీ ఉన్న ప్రాంతం దగ్గరకు బైక్ వెళ్లేసరికి తన అసలు రంగు బయటపెడుతుంది. డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇవ్వకపోతే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డావని చెప్తానని బెదిరిస్తోంది. దీంతో తప్పక ఆమె అడిగిందల్లా ఇచ్చి జేబు గుళ్ల చేసుకుంటున్నారు. చేసిన పని బయటకు చెప్తే ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో కొంతమంది ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. అయితే ఇటీవలే ఆ కిలేడీ ఓ వ్యక్తిని ఇలానే బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ షాకింగ్ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 21న విశాఖకు చెందిన ఓ వాహనదారుడిని ఓ యువతి లిఫ్ట్ అడిగింది. పాపం అని లిఫ్ట్ ఇస్తే అతడిని బెదిరించి రూ.5 వేలు, బంగారు ఉంగరం డిమాండ్ చేసి లాగేసుకుంది. దీంతో బాధితుడు తనను లిఫ్ట్‌ అడిగి బెదిరించి రూ.5 వేలు నగదు, పావు తులం బంగారం తీసుకుందని అదేరోజు విజయనగరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా సహాయంతో నిందుతురాలిని గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

నిందితురాలు గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన రోజువారి కూలీగా పనిచేసే లక్ష్మి అని గుర్తించారు. లక్ష్మికి తల్లి లేదు. తండ్రి ఉన్నా పట్టించుకోడు. కూలి పనులకు వెళ్లేది. ఆమె చెడు వ్యసనాలకు బానిసగా మారింది. కూలీ డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలకు పాల్పడేది. అయితే ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. దీంతో తాజాగా రోడ్డుపై నిలబడి బైక్‌పై లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుంది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story