భూసేకరణలో అవినీతి : నీలంసాహ్నికి చంద్రబాబు లేఖ

by srinivas |
భూసేకరణలో అవినీతి : నీలంసాహ్నికి చంద్రబాబు లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: పేదల ఇళ్లపట్టాల కోసం చేపట్టిన భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎస్ నీలంసాహ్నికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడిలో భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. 600ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించినట్లు తెలిపారు. ఎకరం రూ.45 లక్షల చొప్పున రూ. 270 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆవ భూముల్లోనే మొత్తం రూ.500 కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ జరిగిందన్నారు. అధికార వైసీపీ నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

భూసేకరణలో తొలిదశ అవినీతి మెరక, లే అవుట్ లో, రోలింగ్‌లో రెండో దశ అవినీతి జరిగిందన్నారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుడే అవినీతి అక్రమాలు అనేకం బయట పడతాయన్నారు. సమగ్ర విచారణ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. లేఖతోపాటు వరదల్లో నీట మునిగిన ఆవ భూములపై పేపర్ క్లిప్పింగ్‌లు కూడా పంపారు.

Advertisement

Next Story

Most Viewed