ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

by Shyam |
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
X

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో :
లాక్‌డౌన్ నేపథ్యంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు, భవన నిర్మాణ, అసంఘటిత, చేతివృత్తి కార్మిక కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రెండు, మూడు నెలలు రేషన్ తీసుకోలేదనే నెపంతో దాదాపు 9 లక్షల కుటుంబాలకు లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వం అందిస్తోన్న బియ్యం, డబ్బులు అందడం లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు వారి సంక్షేమ నిధి నుంచి రూ.1500 ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా నేటికీ ఇవ్వకపోవడం దురదృష్టకరమని తెలిపారు. కేరళ రాష్ట్రంలో కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి బియ్యంతో పాటు 17 రకాల నిత్యావసర వస్తువులు, రూ.2000 ఆర్థిక సాయం అందజేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు వారి సంక్షేమ నిధి నుంచి కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు రూ.5 వేలు, తమిళనాడు రాష్ట్రంలొ రూ.3 వేలు ఇస్తుండగా.. తెలంగాణలో మాత్రం బియ్యం, రూ. 1500లతోనే సరిపెట్టారని పేర్కొన్నారు.

కేరళ, కర్ణాటక రాష్ట్రాలు.. ఆటో డ్రైవర్లు, ఇతర చేతివృత్తుల వారితో పాటు అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నిరుపేద కుటుంబాలకు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నాయో పరిశీలించాలని చాడ వెంకటరెడ్డి లేఖలో ప్రస్తావించారు. ‘భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి రూ.5 వేలు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని వారికి, రేషన్ కార్డు ఉండి కూడా నిరాకరించిన వారికి 12 కిలోల బియ్యం, రూ. 1500 ఇవ్వాల‌ని, మిగతా అసంఘటిత కార్మికులు, చేతివృత్తుల కుటుంబాలకు రూ.5 వేల చొప్పున అందించాలని’ చాడ వెంకటరెడ్డి లేఖలో కోరారు.

Tags: CPI, Venkatreddy, KCR, Letter, Ration cards, building workers

Advertisement

Next Story

Most Viewed