‘కమ్యూనిస్టులను విమర్శించే నైతికత ఈటలకు లేదు’

by Shyam |
‘కమ్యూనిస్టులను విమర్శించే నైతికత ఈటలకు లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫాసిస్ట్ బీజేపీలో చేరుతున్న ఈటల రాజేందర్‌కు కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే నైతికత ఎక్కడిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. వామపక్ష లౌకికవాదినని చెబుతూనే మతోన్మాత పార్టీలో చేరాలన్న ఈటల నిర్ణయమే ఆయన వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం నిర్వహించిన ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో చాడ మాట్లాడుతూ.. ఎన్నికల్లో సీపీఐ పోటీచేసే విషయాన్ని ఎవరూ నిర్ణయిస్తారో తెలుసునన్న రాజేందర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమది జాతీయ పార్టీ అని, ఎవరి మార్గదర్శకాలకు, వ్యక్తుల ప్రమేయాలకు అనుగుణంగా నడవదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటల బీజేపీలో చేరాలనుకోవడం ఆయన వ్యక్తిగతమని, తన స్వప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నా వామపక్షాలపై ఆరోపనలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నామని అన్నారు.

టీఆర్‌ఎస్‌, సీపీఐ మధ్య రాజకీయంగా ఎన్నడూ చర్చ జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వెంకట్ రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ను లౌకిక పార్టీగానే చూస్తున్నామని, ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని ఓడించే లౌకిక పార్టీల్లో బలమైన పార్టీకే మద్దతునిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నియంతృత్వ, ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలలుగా రైతులు ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. పెరిగిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు నిరసనగా సీపీఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించిందే వామపక్ష పార్టీలని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌లో నిరసనలకు తావు లేకుండా పోతే మగ్దూంభవన్‌ వేదికగా ఇతర పక్షాలతో కలిసి నెల రోజుల పాటు ధర్నా చేశామని గుర్తు చేశారు. అసైన్‌మెంట్‌ భూములు ఎవరు కొనుగోలు చేసినా తప్పేనని, వెంటనే వాటిని ప్రభుత్వానికి అప్పగించడం సమంజసమని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సైతం తమ తండ్రి కొనుగోలు చేసిన అసైన్‌మెంట్‌ భూములను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారని చాడ వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed