Bharat Petroleum: బీపీసీఎల్ ప్రైవేటీకరణ కోసం ఎఫ్‌డీఐ సవరణ!

by Harish |   ( Updated:2021-05-28 03:38:09.0  )
Bharat Petroleum: బీపీసీఎల్ ప్రైవేటీకరణ కోసం ఎఫ్‌డీఐ సవరణ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లో విదేశీ పెట్టుబడిదారులకు మెజారిటీ వాటా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. 49 శాతం వరకు అనుమతి ఉన్న ఎఫ్‌డీఐని 100 శాతానికి పెంచే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం ప్రస్తుతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానాల్లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ప్రభుత్వం బీపీసీఎల్‌లో తనకున్న 52.98 శాతం వాటాను విక్రయించి సంస్థను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. బీపీసీఎల్ వాటా కోసం ఇప్పటికే ప్రముఖ సంస్థ వేదాంత ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) తెలిపింది. దీంతో పాటు గ్లోబల్ ఫండ్స్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ ఈఓఐ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన విషయంపై పెట్టుబడుల నిర్వహణ విభాగం(దీపమ్), పరిశ్రమ(డీపీఐఐటీ), ఆర్థిక వ్యవహారాల(డీఈఏ) విభాగాలు చర్చిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం.. పెట్రోలియం సంస్థల్లో విదేశీ సంస్థ వాటా కొనేందుకు 49 శాతం వరకే అనుమతి ఉంది. దీన్ని సవరించి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించేలా విధానాల్లో మార్పులు చేయాలని దీపమ్ సూచించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story