మిగులు బియ్యంతో హ్యాండ్ శానిటైజర్‌ల తయారీ: కేంద్రం

by vinod kumar |
మిగులు బియ్యంతో హ్యాండ్ శానిటైజర్‌ల తయారీ: కేంద్రం
X

న్యూఢిల్లీ: పంట పొలాల నుంచి గోధుమలు, బియ్యం కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి చేరుతుంది. ఈ ఎఫ్‌సీఐ దగ్గర దేశ ప్రజలకు కావాల్సినదానికన్నా.. విపత్తు సమయాలను దృష్టిలో పెట్టుకుని నిర్దేశిత మొత్తంలో ధాన్యాన్ని అదనంగా నిల్వ ఉంచుతారు. అయితే, ఎఫ్‌సీఐ దగ్గరున్న మిగులు(సర్‌ప్లస్) బియ్యం(బఫర్ స్టాక్ కంటే అదనంగా) నిల్వలను ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌లలో ఉపయోగించే ఇథనాల్‌గా మార్చాలని సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన నేషనల్ బయోఫ్యుయెల్ కోఆర్డినేషన్ కమిటీ(ఎన్‌బీసీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటన పేర్కొంది. ఒక సాగు సంవత్సరంలో అవసరానికన్నా ఎక్కువ మొత్తంలో ధాన్యం సప్లై అవుతుందని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంచనా వేస్తే ఆ ధాన్యాన్ని ఎన్‌బీసీసీ ఆమోదంతో ఇథనాల్‌గా మార్చాలన్న నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మార్చి 1వ తేదీ వరకు ఎఫ్‌సీఐ దగ్గర 77.6 మిలియన్ టన్నుల గోధుమలు, బియ్యం నిల్వలున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఆపరేషనల్ బఫర్ స్టాక్‌గా 21.04 మిలియన్ టన్నుల ధాన్యముంటే చాలు. అంటే కనీసం ఆపరేషనల్ బఫర్ స్టాక్ కన్నా.. ఎఫ్‌సీఐ దగ్గర సుమారు మూడు రెట్లు అధికంగా ధాన్యమున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.

కాగా, సార్వజనీన ఆహార భద్రతను కల్పించాలని, అన్నార్తులందరికీ ఎటువంటి అర్హతలను షరతులుగా పెట్టకుండా ధాన్యాన్ని అందించాలని సామాజిక కార్యకర్తలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆ డిమాండ్ మాత్రం నెరవేరలేదు. అదీగాక, రేషన్‌కు ఆధార్ లంకె లేక, బయోమెట్రిక్ లోపాలు, కార్డుల ఏరివేతలో అసలు దారులు గల్లంతవ్వడం, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంతో కేంద్ర సూచించిన సుమారు 40 లక్షల మంది బడుగులు సహా లక్షలు లేదా కోట్లాది మంది అన్నార్తులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఆహారం అందక ఆకలిచావులు చోటుచేసుకున్న వార్తలు చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ‘మిగులు ధాన్యాన్ని’ ఇథనాల్ ఇంధనానికి వినియోగించే నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆపత్కాలంలో హ్యాండ్ శానిటైజర్‌ కూడా ప్రాణాల్ని కాపాడే ఆయుధమేనని ఇంకొందరు వాదిస్తున్నారు.

TAGS: rice, FCI, hand sanitizers, convert, ethanol, bio fuel, centre, surplus

Advertisement

Next Story

Most Viewed