డీపీఆర్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదా?

by srinivas |
డీపీఆర్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్​పై కేంద్ర జల సంఘం ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. డీపీఆర్​ ఎలా ఇవ్వాలో కూడా మీ అధికారులకు తెలియదా? అంటూ చివాట్లు పెట్టింది. తెలియకపోతే సీడబ్ల్యూసీ వెబ్​సైట్​లో నమూనాలు ఉంటాయని, వాటి ప్రకారం అయినా ఇవ్వాలని సూచించింది. ఎలాంటి వివరాలు కూడా లేకుండా డీపీఆర్ ఎలా​ ఇచ్చారంటూ కేంద్ర జల సంఘం సభ్యుడు ముఖర్జీ గురువారం ఏపీ జల వనరుల శాఖకు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సంగమేశ్వరం దగ్గర రోజుకు మూడు టీఎంసీను ఎత్తిపోసే ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అపెక్స్​ కౌన్సిల్​లో కూడా చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టు కావడంతో డీపీఆర్​లు ఇచ్చాకే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఎన్జీటీ కూడా నోటీసులు జారీ చేసింది. అనివార్యం కావడంతో ఏపీ ప్రభుత్వం సోమవారం కృష్ణా బోర్డుకు డీపీఆర్​ పంపించింది. ఇందులో చాలా మేరకు తప్పులు ఉండటం, వివరాలు లేకపోవడంతో బోర్డు దాన్ని సీడబ్ల్యూసీకి పంపించింది. చాలా వివరాలను దాచి పెట్టాల్సి రావడంతో కేంద్రానికి పంపిన డీపీఆర్​లో తప్పులు దొర్లాయి. ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్​ను ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదంటూ జలసంఘం మండిపడింది. 46 పేజీల డీపీఆర్​లో కనీస సమాచారాన్ని కూడా దాచి పెట్టారని, హైడ్రాలజీ, ఇంటర్​ స్టేట్​ అంశాలు, ఇరిగేషన్​ ప్లానింగ్​, డిజైన్లు, వ్యయ అంచనాలు లేవని అసహనం వ్యక్తం చేసింది. ఈ డీపీఆర్​తో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేసింది.

తెలంగాణే జల దోపిడి చేస్తోంది

ఏపీ ప్రభుత్వం డీపీఆర్ లో తెలంగాణనే తప్పు పట్టింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేసింది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా 2015లోనే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టిందని పేర్కొంది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచి రోజుకు 0.4 టీఎంసీలు, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచి రోజుకు 0.5 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారని ఆరోపించింది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు మూడు టీఎంసీలను తరలించేలా తెలంగాణ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించింది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోందని, మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని వివరించింది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చని, గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులు కూడా ఉండే అవకాశం లేదని పేర్కొంది. శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు పీహెచ్‌ఆర్‌ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయని, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా రాదని, తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోవడంతో దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటుందని డీపీఆర్​లో సూచించింది.

అది మా హక్కు

ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు, ట్రిబ్యునల్‌ ద్వారా హక్కుగా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నీటిమట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని ఏపీ విన్నవించింది. ఈ మూడు టీఎంసీలను ఎత్తిపోసేందుకు రూ. 3,248 కోట్లతో పథకాన్ని చేపట్టామని, సంగమేశ్వరం దగ్గర 787.40 అడుగుల మట్టం నుంచి 17.59 కిలోమీటర్ల దూరం అప్రోచ్​ కెనాల్​ తవ్వి పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాల్వలో కలుపుతున్నట్లు వెల్లడించింది. శ్రీశైలంలో 880 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకునేందుకు తెలంగాణకు అవకాశం ఉందని, 23.37 లక్షల ఎకరాల ఆయకట్టుకు 213 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని, ప్రస్తుతం శ్రీశైలంలో విద్యుత్​ ప్రమాదం జరిగిన సమయంలో రోజుకు 4 టీఎంసీల చొప్పున 110 టీఎంసీలను దిగువకు వదిలినట్లు డీపీఆర్​లో సూచించారు. తెలంగాణను ఎంత కోరినా ఏపీ ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని, శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం నిర్వహించాలని కోరుతున్నామని, అయినా విద్యుత్​ ప్లాంట్​ను ఆపలేదని, దీంతో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుంద పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా 875 అడుగులపైన ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నడుపమని, పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుంటామని, నీటిమట్టం 841 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవడానికి వీలవుతుందని, 841 అడుగుల కంటే దిగువన ఉన్నప్పుడు మాత్రం సంగమేశ్వరం ద్వారా నీటిని మళ్లిస్తామని, 841 నుంచి 874 అడుగుల మధ్య అవసరమైనప్పుడు మాత్రమే లిప్ట్​ను ఉపయోగిస్తామని డీపీఆర్​లో సూచించారు. డీపీఆర్​ మొత్తంగా తెలంగాణ ప్రభుత్వమే ఏపీకి అన్యాయం చేస్తుందన్నట్టుగా పేర్కొన్నారు.

Advertisement

Next Story