కరోనా అంచనాకు కేంద్ర బృందం పర్యటన

by Shyam |   ( Updated:2020-03-04 10:19:29.0  )

దిశ, హైదరాబాద్
తెలంగాణలో కోవిడ్‌ వైరస్‌ కేసు నమోదు కావడంతో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి వచ్చింది. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)కు చెందిన ముగ్గురు సభ్యుల వైద్య నిపుణుల బృందం కోవిడ్‌ నివారణకు రాష్ట్ర సర్కారు చేపడుతున్న చర్యలను పరిశీలిస్తోంది. గాంధీ, ఫీవర్, ఛెస్ట్, మిలటరీ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఈ బృందం గురువారం కూడా హైదరాబాద్‌లో ఆయా ఆసుపత్రులకు వెళ్లి ప్రొటోకాల్‌ ప్రకారం కోవిడ్‌ నివారణ చర్యలు చేపడుతున్నారా? లేదా అధ్యయనం చేయనుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిఘా…

కోవిడ్ వైరస్ వ్యాప్తించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక మార్గదర్శకాలు, జాగ్రత్తలు జారీచేసింది. తెలంగాణలోనూ కోవిడ్‌ కేసు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ ప్రతినిధులు వైరస్‌ తీవ్రత, మున్ముందు దీని వ్యాప్తిపై నిఘా పెట్టనున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

మంత్రి ఈటల రాజేందర్‌ సీఎస్ సోమేష్‌కుమార్‌తో భేటీ

కరోనా వైరస్ ప్రచారంపై ప్రధానంగా దృష్టిసారించాలని మంత్రి ఈటల సీఎస్ సోమేష్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో విస్త్రృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరాన్నివారిరువురు చర్చించారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా వైద్యాధికారులతో చర్చించారు. కోవిడ్‌ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన అంశాలను వారు చర్చించారు.

100 మంది మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌కు శిక్షణ

కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు బుధవారం శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణకు వంద మంది హాజరయ్యారు. ప్రజల్లో అవగాహన ఎలా పెంచాలనే దానిపై వారికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

tags;corona virus, covid-19, cdc, already WHO give guidelines, health minister meeting with cs somesh kumar

Advertisement

Next Story

Most Viewed