కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత.

by Anukaran |   ( Updated:2020-10-08 11:49:11.0  )
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత.
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ప్రముఖ దళిత నేతగా గుర్తింపు పొందిన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా గురువారం సాయంత్రం మృతిచెందారు. బీహార్‌లోని దళిత కుటుంబంలో పుట్టిన పాశ్వాన్ డీఎస్పీ ఉద్యోగాన్ని సైతం వదులుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. దళితుల, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పాశ్వాన్ జాతీయస్థాయి దళిత నేతగా గుర్తింపు పొందారు. పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు.

న్యాయశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి రాజకీయాల్లోకి వచ్చిన పాశ్వాన్ 1995 మొదలు మృతిచెందే వరకు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఐదుగురు ప్రధానుల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పార్టీలకు అతీతంగా ఏ కూటమి ఏర్పడినా అంశాలవారీ మద్దతుతో కేంద్రమంత్రిగానే వ్యవహరించారు. 1969లో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా బీహార్ నుంచి ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.

ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో గుండెకు సర్జరీ అయిన తర్వాత కోలుకుంటారనుకున్న సమయంలో దూరమయ్యారంటూ ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేయడంతో చనిపోయిన విషయం బయటకు వచ్చింది. బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కీలక సమయంలో ఆయన చనిపోవడం ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ, లోక్ జనశక్తి పార్టీకి తీరని లోటు అని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. 1969లో సంయుక్త సోషలిస్టు పార్టీతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేషనల్ లోక్‌దళ్, జనతాదళ్, జనతాపార్టీల మీదుగా సాగి చివరకు స్వంతంగా పెట్టుకున్న లోక్ జన శక్తి పార్టీ వరకు సాగింది.

Advertisement

Next Story

Most Viewed