బిగ్ బ్రేకింగ్ : పాక్‌కు అమిత్ షా వార్నింగ్.. అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్‌ చేస్తాం

by Shamantha N |   ( Updated:2021-10-14 06:49:45.0  )
బిగ్ బ్రేకింగ్ : పాక్‌కు అమిత్ షా వార్నింగ్.. అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్‌ చేస్తాం
X

పనాజీ : అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ చేయడానికి వెనుకడగు వేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్‌ను హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో తాజాగా ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సైస్ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్ఎస్‌యూ)కు గురువారం అమిత్ షా శంకుస్థాపన చేశారు. గతంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఆధ్వర్యంలో పాక్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ప్రధానమైందని అన్నారు. భారత సరిహద్దులను ఇబ్బందులకు గురిచేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ దాడుల ద్వారా చెప్పామన్నారు. ఒకప్పుడు చర్చలకు సమయం ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చిందని పునరుద్ఘాటించారు. మనోహర్ పారికర్ రక్షణ శాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉరీ, పఠాన్‌కోట్‌, గురుదాస్‌పూర్‌లలో పాక్‌ ఉగ్రమూకల దాడులకు భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్‌తో ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు.

మెజారిటీతో గోవాలో అధికారంలోకి బీజేపీ..

పూర్తిస్థాయి మెజారిటీతో త్వరలోనే గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కొన్ని యుగాల వరకు గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తీసుకురావడానికి మోడీ, పారికర్‌లు కృషి చేశారన్నారు. కేంద్రంలో, గోవాలో బీజేపీ ప్రభుత్వం గత దశాబ్దంలో రాష్ట్రానికి అసలు సిసలైన అభివృద్ధిని, స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చిందని తెలిపారు. ఎన్నికలు కాస్త దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేరారోపణ రేట్లను మెరుగుపరచడానికే ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో గోవా యువతకు ఫోరెన్సిక్ రంగంలో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ఆరు సంవత్సరాలకు పైగా శిక్షను అందించే కేసులలో ఫోరెన్సిక్ ప్రమేయం తప్పనిసరి చేయాలన్నారు. గోవాలో అర్హులైన వారికి 100 శాతం మొదటి డోసు టీకాను పూర్తి చేసింనందుకు సీఎం ప్రమోద్ సావంత్‌ను అమిత్ షా అభినందించారు.

Advertisement

Next Story