ప్రభుత్వాఫీసుల్లో ప్రవేశానికి ఆంక్షలు

by Shamantha N |
ప్రభుత్వాఫీసుల్లో ప్రవేశానికి ఆంక్షలు
X

దిశ, న్యూస్ బ్యూరో
ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ సందర్శకుల ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సంబంధిత అధికారి నుంచి అనుమతి ఉంటే తప్ప సందర్శకులను ఆఫీసుల్లోకి వెళ్ళడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్ర హోంశాఖ పరిధిలోని డీవోపీటి ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. రోజువారీ అనుమతి పాస్‌లను రద్దు చేయాలని సూచించింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలను, ఫైళ్ళను కార్యాలయం లోపలికి వెళ్ళి సంబంధిత సెక్షన్‌లో ఇవ్వడానికి బదులుగా ఎంట్రీ గేటు దగ్గరే ఒక ‘డాక్’ సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని అన్ని కార్యాలయాలకూ సూచించింది. ఆఫీసు లోపలికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ (ఉద్యోగులు సహా) విధిగా శానిటైజర్‌ను ఇవ్వాలని తెలిపింది. ఎవరికైనా జలుబు, దగ్గు, ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే వారిని లోపలికి అనుమతించరాదని, తగిన వైద్య చికిత్స తీసుకోవాలని తేల్చిచెప్పింది. కరోనా వ్యాధి నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డీవోపీటీ ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులోని మరికొన్ని అంశాలు..

1.సందర్శకులకు అనుమతి పాస్‌లను తక్షణం రద్దు చేయాలి.
2.ఆఫీసులోకి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ, ఉద్యోగులైనా సరే, తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
3.వీలైనంత వరకు మీటింగ్‌లను వాయిదా వేయాలి. తప్పనిసరి అయితే వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాన్ని వాడుకోవాలి.
4.తప్పనిసరి అనిపిస్తే మాత్రమే ఇతర ప్రాంతాలకు వెళ్ళే క్యాంపులను ప్లాన్ చేసుకోవాలి. ఏ మాత్రం నివారించుకునే అవకాశం ఉన్నా వాటిని రద్దు చేసుకోవాలి.
5.వీలైనంత వరకు ప్రభుత్వ మెయిల్‌ల ద్వారానే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఫైళ్ళను, డాక్యుమెంట్లను పంపుకోవడాన్ని కుదించుకోవాలి.
6.కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే క్రెచ్, జిమ్‌లు, రిక్రియేషన్ కేంద్రాలను తక్షణం మూసివేయాలి.
7.బయోమెట్రిక్ వ్యవస్థను కొంతకాలం వినియోగించడం మానుకోవాలి.
8.సెలవు మంజూరుచేసే అధికారులు సిబ్బంది ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సెలవులివ్వాలి.
9.కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని గర్భిణీలు, ఎక్కువ వయసున్న ఉద్యోగులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉన్నతాధికారులు సెలవులపై
సానుకూలంగా స్పందించాలి.
10.పని స్థలాల్లో ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టాలి.
11.అన్ని ఆఫీసులు, వాష్ రూమ్‌లలో హాండ్ వాష్, సబ్బు, నిరంతరాయ నీటి సరఫరా ఉండాలి.

tags : Central Government, Circular, Employees, Corona, Do’s and Don’ts, DoPT

Advertisement

Next Story