- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రెడ్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ప్రణాళికకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెడ్ సిగ్నల్ చూపింది. రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌కు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకున్నదని, డిజైన్ మార్పుతో మూడో టీఎంసీకి ప్రణాళిక రూపొందించడం కొత్తదానిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించిన తర్వాత హైడ్రాలజీ అధ్యయనం, సాంకేతిక అంశాల పరిశీలన, అంచనా వ్యయం, పర్యావరణ ప్రభావం, అంతర్ రాష్ట్ర అంశాలు తదితరాలన్నింటిపై స్టడీ పూర్తయిన అనంతరం మాత్రమే తగిన అనుమతులు తీసుకోవాలని తేల్చిచెప్పింది.
ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈనెల 12న తెలంగాణ సీఎంకు నాలుగు పేజీల లేఖ రాశారు. మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే తగిన అనుమతులు పొందాల్సి ఉంటుందని సూచించారు. సీతారామ ఎత్తపోతల పథకం, జీఎల్ఐఎస్-3వ దశ, తుపాకులగూడెం ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగ మీద కట్టే తెలంగాణ త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు బారేజీ, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సు వరకు నీటి మళ్లింపు తదితర ప్రణాళికలకు కూడా గోదావరి నది యాజమాన్య బోర్డు నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే చేపట్టాలని స్పష్టం చేశారు.
పోతిరెడ్డిపాడుకూ బ్రేక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించనున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టుకు కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బ్రేక్ వేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏదేని కొత్త ప్రాజెక్టును చేపట్టినప్పుడు సంబంధిత నదీ యాజమాన్య బోర్డులకు తప్పనిసరిగా డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదే విషయాన్ని అక్టోబరు ఆరున జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించుకోవడంతోపాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమ్మతించారని కేంధ్ర మంత్రి గుర్తుచేశారు.
బోర్డులు ఆ డీపీఆర్‌లను అధ్యయనం చేసిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి మేరకు నిర్మాణాలు మొదలవుతాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాజెక్టులు కృష్ణా మొదటి ట్రిబ్యునల్ లేదా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనబడినప్పటికీ అవి పాతవే అనే అభిప్రాయం సరికాదని, వాటికి అన్ని రకాల అనుమతులు మంజూరైతే మాత్రం పాతవాటిగా పరిగణించడం సాధ్యమవుతుందని వివరణ ఇచ్చారు. అనుమతులు పొందకపోయినా, పొందిన తర్వాత నిర్దిష్ట డిజైన్‌కు మార్పులు చేసినా మళ్లీ అనుమతి తీసుకోవడం తప్పదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ విస్తరణ ప్రాజెక్టు కొత్తదానిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
టెలిమెట్రీకి నిధులివ్వలే
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ తలపెడుతున్న పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను నిలువరించడంలో కృష్ణా బోర్డు విఫలమైందని తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాన్ని మంత్రి ప్రస్తావించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుకు టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయడం సహేతుకమైన విధానం అవుతుందన్నారు. రెండు రాష్ట్రాలూ ఈ వ్యవస్థను నెలకొల్పడానికి సమ్మతించినా, నిధులను ఇవ్వని కారణంగానే కృష్ణా బోర్డు చేపట్టలేదని, తప్పును బోర్డు మీదకు నెట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయం ఖరారైన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుపై పర్యవేక్షణ విషయం తేలుతుందని, తెలంగాణ కోరినట్లుగా శ్రీశైలం ఆపరేషన్ నియంత్రణను ఇవ్వడంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోలేమన్నారు.
సుప్రీం ఉత్తర్వుల తర్వాతే
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయమైన నీటి వాటా లభించడం లేదన్న అంశాన్ని కేంద్ర మంత్రి ఆ లేఖలో ప్రస్తావిస్తూ, ప్రత్యేక ట్రిబ్యునల్‌కు ఈ విషయాన్ని అప్పగించాల్సిందిగా తెలంగాణ కోరిందన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున అది తేలే వరకు కొత్త ట్రిబ్యునల్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోజాలదన్నారు. సుప్రీంకోర్టులో తొలుత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ 2010లో వెల్లడించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్‌లు దాఖలు చేశాయని, ఇంకా అవి విచారణలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
ఆ పిటిషన్‌లను ఉపసంహరించుకోనున్నట్లు అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హామీ ఇచ్చినా ఇంకా ఆ పని జరగలేదని పేర్కొన్నారు. కృష్ణా నదికి ట్రిబ్యునల్ ఉన్నట్లుగానే గోదావరి నదికి కూడా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ రాష్ట్రాల నుంచి లేఖలు రావాల్సి ఉందని, ఇంకా రాలేదని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశమై నదీ జలాల విషయంపై చర్చించిన తర్వాతి రోజే ఈ తరహా లిఖితపూర్వక సమాధానం రావడం గమనార్హం. తెలంగాణ చేసిన విజ్ఞప్తులు, అక్టోబర్ రెండున రాసిన లేఖలో ప్రస్తావించిన ఆరు అంశాలపై కేంద్ర మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు.