శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కేంద్రం ప్రభుత్వం: తమ్మినేని వీరభద్రం..

by Shyam |   ( Updated:2021-12-15 08:56:33.0  )
శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కేంద్రం ప్రభుత్వం: తమ్మినేని వీరభద్రం..
X

దిశ, అమరచింత: 8 గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్న ఘనత కార్మికులదని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన రహదారిపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా 2వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తుందన్నారు. పాలన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, నేటి వరకు కార్మికులు, రైతులు, దళితులపై వివక్ష చూపుతూ వస్తుందన్నారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని వేలాది మంది రైతులు ఢిల్లీలో పోరాటాలు చేశారని, వారి పోరాట ఫలితంగా మోదీ వెనక్కి తగ్గారని గుర్తు చేశారు.

అందువల్ల కార్మికులు, కర్షకులు రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజలు, కార్మికుల అండగా నిలబడి పోరాడిందని గుర్తుచేశారు. ఇప్పటి కైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి గద్దె దించుతామని హెచ్చరించారు.

అంతకు ముందు మున్సిపాలిటీ కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ నుంచి, తహశీల్దార్ కార్యాలయం మీదుగా బహిరంగ సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కళాకారుల ఆట పాటలు, చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, సీపీఎం రాష్ట్ర నాయకులు కిల్లి గోపాల్, జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బర్ ఆయా జిల్లాల కార్యదర్శులు భూపాల్, వెంకట్రామిరెడ్డి, వనపర్తి జిల్లా నాయకులు, పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, ఎం లక్ష్మీ, డి.బాల్ రెడ్డి, ఆర్ ఎన్ రమేష్, గోపి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed