సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం రెడీ.. AITUC నాయకుల వార్నింగ్

by Aamani |   ( Updated:2021-10-26 01:49:15.0  )
సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం రెడీ.. AITUC నాయకుల వార్నింగ్
X

దిశ, తాండూర్ : సింగరేణిలోని పలు బొగ్గు బ్లాకుల వేలం పాటను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి వర్క్ షాప్, అబ్బాపూర్, ఖైరిగూడ ఓసీపీలు, అన్ని డిపార్ట్‌మెంట్ల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ యూనియన్ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి సోమారం తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి మాట్లాడుతూ.. కోల్ ఇండియాలోని 83 బొగ్గు బ్లాక్‌లతోపాటు సింగరేణికి చెందిన కేకే 6, శ్రావణ్ పల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం ఓసీపీ బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలంపాట ద్వారా ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు.

సింగరేణి గనుల ప్రైవేటీకరణ, కేంద్రం చర్యలను నిరసిస్తూ గతంలో జాతీయ సంఘాలు మూడు రోజులపాటు సమ్మె చేస్తే సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి.. ఆ రోజున సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేశాయని ఆరోపించారు. సింగరేణిలోని బొగ్గు గనులను ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయనివ్వమని, అవసరమైతే 49 శాతం కేంద్రం వాటాను తెలంగాణ ప్రభుత్వమే తీసుకొని సింగరేణిని కాపాడుతామని శ్రీరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం పాటపై సీఎం కేసీఆర్, గుర్తింపు సంఘం నాయకులు ఇప్పుడు నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వలన కార్మికులకు తీరని అన్యాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన సన్నగిల్లుతాయని అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే జాతీయ కార్మిక సంఘాలతో కలిసి ఎన్ని పోరాటాలు చేసేందుకైనా ఏఐటీయూసీ సిద్ధంగా ఉందన్నారు. స్థానిక గనుల మేనేజర్లకు, డెపార్టుమెంట్ అధికారులకు నాయకులు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో నాయకులు జగ్గయ్య, శేషు, రెహమాన్, శ్రీనివాస్, కిరణ్ బాబు, సారయ్య, ఆనంద్, రాజేష్, మోహన్ కృష్ణ, వెంకటేశం, రఘునాథరెడ్డి, పీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed