తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్.. కేంద్ర సర్వేలో సంచలన నిజాలు

by Anukaran |
తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్.. కేంద్ర సర్వేలో సంచలన నిజాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేట్‌లో కొలువులు దొరకడం కష్టతరంగానే మారింది. రెండేండ్ల నుంచి పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. కరోనా కారణంగా గతేడాది మూతపడిన, ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన సంస్థలు మళ్లీ అవకాశాలు కల్పించడం లేదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనగా రాష్ట్రంలో కొంత ఎక్కువగానే ఉంది. ఏటా రెండు లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వీరిలో డిగ్రీ పట్టాలతో ఉద్యోగ వేటకు వెళ్లేవారు 1.60 లక్షలు ఉండగా.. వృత్తి విద్యా కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు 40 వేల వరకు ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ కెరీర్ సర్వీస్ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను పక్కనపెడితే.. ప్రైవేట్ సంస్థల్లోనే ఇప్పటికిప్పుడు 31,821 కొలువులు ఖాళీలున్నాయి. వీటిని ఖాళీలుగా చూపిస్తున్నా భర్తీ చేసుకునేందుకు ఆ సంస్థలు ముందుకు రావడం లేదు.

అన్ని సంస్థల్లోనూ నో వెకెన్సీ..

అక్టోబర్ 5 నాటికి దేశ వ్యాప్తంగా ప్రైవేట్, గవర్నమెంట్, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలపై నేషనల్ కెరీర్ సంస్థ సమగ్ర నివేదికను వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగ ఖాళీలున్న రాష్ట్రం మనదే కావడం గమనార్హం. ప్రైవేట్​సంస్థలు కొత్తగా నిరుద్యోగులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. కరోనా పరిస్థితులకు ముందు తొలగించిన, తాత్కాలికంగా పక్కన పెట్టిన సంస్థలు.. ఇప్పుడు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయడం లేదు. మరోవైపు కరోనా పరిస్థితులు, ఆర్థికపరమైన అంశాలతో ప్రైవేట్ సంస్థల్లో ఇప్పటికీ తొలగింపు ప్రక్రియే కొనసాగుతోందని కేంద్ర నివేదిక వెల్లడించింది.

ప్రైవేట్​ ఉద్యోగుల ఖాళీలు తెలంగాణలోనే 31,192 ఉండగా.. 22,795 పోస్టుల ఖాళీలతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా డామన్ డయ్యూలో 6, మిజోరాంలో 10, సిక్కింలో 16 ఖాళీలున్నాయి. రాష్ట్రంలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు కంపెనీలు ఏడాదిగా ముందుకు రావడం లేదు. ఆ పని భారాన్ని కూడా ఇప్పుడున్న వారితోనే నెట్టుకువస్తున్నాయి. తమ సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొత్త ఉద్యోగాలివ్వలేమని కార్మికశాఖ నోటీసులకు సమాధానాలు ఇస్తుండటం గమనార్హం.

20 లక్షల మంది నిరుద్యోగులు..

ఇక రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు అంచనా. ప్రతీ ఏటా రెండు లక్షల మంది డిగ్రీ పట్టాలతో ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. వీరికి ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో కేవలం 0.40 శాతం మంది మాత్రమే సొంతంగా వ్యాపారాలు చేసుకుంటుండగా.. మరికొందరు వ్యవసాయం వైపు వెళ్తున్నారు. కానీ మెజార్టీగా మాత్రం ఉద్యోగాల కోసం తిరుగుతూనే ఉన్నారు. కరోనా కాలంలో ప్రైవేట్​ సెక్టార్‌లో కొలువులు కోల్పోయిన వారు కంపెనీల్లో మళ్లీ దరఖాస్తులు పెట్టుకున్నా వారిని తీసుకోవడం లేదని వెల్లడైంది. దీంతో నిరుద్యోగిత శాతం పెరుగుతున్నట్లు అంచనా.

రాష్ట్రంలో ప్రైవేట్​ సెక్టార్​లో ఖాళీలు.. 31,192 మంది
ప్రతిఏటా డిగ్రీ పట్టాలున్న నిరుద్యోగులు.. 1.60 లక్షల మంది
వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు.. 40 వేల మంది
కొలువుల కోసం ఎదురుచూస్తున్నది.. 20 లక్షల మంది.

Advertisement

Next Story