రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసుల సోదాలు

by Shyam |   ( Updated:2020-03-21 05:43:03.0  )
రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసుల సోదాలు
X

దిశ, హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేశారు. రవి ప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నాడన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎస్ఆర్ఈఐ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. బషీర్ బాగ్ కేంద్రంగా వ్యాపారం చేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్ కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ. 110 కోట్ల రుణం కోసం 2018లో దరఖాస్తు చేస్తున్నారు. ఆతర్వాత అదే ఏడాది అక్టోబర్‌ నుంచి ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో వడ్డీతో సహా రుణం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ రుణానికి సంబంధించి హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలం, కింగ్‌కోఠిలోని 28 వేల 106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను షూరిటీ పెట్టారు. ఆ తర్వాత మోహం చాటేయంతో ఎస్ఆర్ఈఐ సంస్థ హఫీజ్‌పేటలో ఉన్న స్థలాన్ని వేలం వేసి రూ. 102.6 కోట్లు రాబట్టుకుంది. కాగా, మిగిలిన నజ్రీబాగ్ ప్యాలెస్ వేలానికి ప్రయత్నించగా అప్పటికే వేరే వారికి విక్రయించినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్న సుకేశ్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారిపై కూడా కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

tag: CCS police, raids, ravi prakash home, sukesh guptha arrest, SREI, hyderabad

Advertisement

Next Story

Most Viewed