పనిమీద పరకాలకు వెళ్తున్నారా.. అయితే వీటితో జాగ్రత్త..!

by Shyam |   ( Updated:2021-08-31 00:59:56.0  )
పనిమీద పరకాలకు వెళ్తున్నారా.. అయితే వీటితో జాగ్రత్త..!
X

దిశ, పరకాల: మీరు ఏదైనా పనిమీద పరకాలకు వెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే ఏ పశువు ఎటువైపు నుంచి దూసుకొచ్చి మీ వాహనాన్ని ఢీ కొడుతుందో తెలియదు. ఈ మాటలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.. కానీ వాస్తవం ఇదే. పరకాల పట్టణంలో పశువులు మందలు మందలుగా తిరుగుతూ పాదాచారులు, వ్యాపారస్తులు, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారిలో పదుల సంఖ్యలో పశువులు మందలుగా తిరుగుతున్నాయి. దీనికితోడు తలలతో ఢీ కొట్టుకుంటూ వాహనాల మీదకు దూసుకువస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

చిరు వ్యాపారులకు ఇబ్బందులు..

కూరగాయల వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారులు, రోడ్డుపై ఉండే చిరు వ్యాపారుల దుకాణాలపై దాడి చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పరకాల మున్సిపాలిటీలో వేలకు వేలు వెచ్చించి పట్టణ సుందరీకరణ కోసం డివైడర్ల మధ్యలో నాటిన మొక్కల్ని సైతం తినేస్తున్నాయి. అంబేద్కర్ సెంటర్ మొదలుకొని బస్ డిపో వరకు ఎక్కడపడితే అక్కడ సంచరిస్తూ.. అడ్డూ అదుపు లేకుండా తిరుగుతూ బీభత్సం సృష్టిస్తున్నాయని స్థానికులు ‘దిశ‌’కు తెలిపారు.

ఇంతకీ ఈ పశువులు ఎవరివి? ఏదైనా ట్రస్ట్ వా? లేక రైతుల వా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ట్రస్ట్ వే గనుక అయినట్లయితే వాటికి గోశాలలు ఏర్పాటు చేసి సంరక్షించాలి కదా? లేదా రైతుల వైతే వాటిని ఇంత విచ్చలవిడిగా వదిలేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ పలువురి వాదన. ఇంత జరుగుతున్నా పరకాల మున్సిపాలిటీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి పశువుల విచ్చలవిడి సంచారాన్ని నిరోధించనట్లయితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story