ఇకపై తాగినోడి బండెక్కినా జైలుకే

by Anukaran |
drunk person,
X

దిశ,తెలంగాణ బ్యూరో : ప్రయాణికులారా తస్మాత్ జాగ్రత్త, నగరంలో నిత్యం వందల సంఖ్యలో డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. తాగి వాహనం నడపడం ద్వారా వారికే కాకుండా మిగతా వాహనాలకు ప్రమాదం కలిగిస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీసులు కొత్త రూల్ ని అమలులోకి తీసుకొచ్చారు. డ్రంక్ డైవ్ తనిఖీల్లో ఇంతకాలం తాగి వాహనం నడిపిన వారిపైనే పోలీసులు కేసు నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్ అమలులోకి రావడంతో తాగి నడిపేవారి వాహనంలో ప్రయాణిస్తున్న వారిపైనా కేసులు పెట్టబోతున్నట్లు సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా గురువారం తెలిపారు.

మోటార్ వెహికిల్ యాక్ట్ లోని 188వ యాక్ట్ ప్రకారం డ్రైవర్ మద్యం తాగారని తెలిసి కూడా వారి వాహనంలో ప్రయాణించడం నేరం. ఓ వ్యక్తి తాగాడని తెలిసి కూడా అతని వాహనంలో ప్రయాణించే వారిని నియంత్రించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరైనా వారు ప్రయాణించే క్యాబ్, ఆటో, బైక్ ఏ వాహనం అయినా డ్రైవర్ తాగాడని తెలిస్తే ఆ వాహనాల్లో ప్రయాణాన్ని నివారించడం మేలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ అలా ప్రయాణిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే డ్రైవర్ తో పాటు మీరు జైలుకెళ్లాల్సిందే.

Advertisement

Next Story