కరెంట్ అఫైర్స్: సెప్టెంబర్ 2022. Current Affairs September 2022

by Harish |   ( Updated:2022-09-12 14:40:08.0  )
కరెంట్ అఫైర్స్: సెప్టెంబర్ 2022. Current Affairs September 2022
X

అంతర్జాతీయం:

కుషియారా జలాలపై ఒప్పందం:

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి.

వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్ లోని సిల్హేట్ ప్రాంతాలకు ప్రయోజనకరమని భావిస్తున్న కుషియారా నదీ జలాల పంపకం ఉంది.

బంగ్లాదేశ్ రైల్వే సిబ్బందికి శిక్షణ, అక్కడి ప్రయాణికుల టికెట్, రవాణా వ్యవస్థ కంప్యూటరీకరణకు భారతీయ రైల్వే సహకరించే ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

మన దేశంలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఇరు దేశాల మధ్య ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత లిజ్ ట్రస్:

బ్రిటన్ ప్రధానిగా ఇప్పటివరకూ ఉన్న బోరిస్ జాన్సన్ స్కాంట్లాండ్ లోని అబెర్డీన్ షైర్ లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2ని కలిసి తన పదవికి రాజీనామా సమర్పించారు.

అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ను ప్రధానిగా రాణి నియమించారు.

స్కాట్లాండ్ నుంచి లండన్ కు చేరుకున్న లిజ్ ట్రస్ (47) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తన మంత్రి వర్గాన్ని నియమించారు.

ట్రస్ మంత్రివర్గంలో భారత సంతతి మహిళా నేత సుయెలా బ్రావెర్మన్ (42)కు కీలక పదవి దక్కింది.

హోం మంత్రిగా ఆమె నియమితులయ్యారు.

జాన్సన్ సర్కారు హయాంలో బ్రావెర్మన్ అటార్నీ జనరల్‌గా పనిచేశారు.

ఇన్నాళ్లూ జాన్సన్ ప్రభుత్వంలో హోం మంత్రిగా భారత సంతతి మహిళా నేత ప్రీతి పటేల్ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఎలిజబెత్ -2 రాణి హయాంలో ప్రధాని అయిన 15వ వ్యక్తి ట్రస్.

బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ -3 ప్రమాణం:

కింగ్ చార్లెస్ -3ను బ్రిటన్ కొత్త రాజుగా ప్రకటించారు.

లండన్ లో సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో అక్సెషన్ కౌన్సిల్ సమక్షంలో ఆయనకు రాజరికపు అధికారాలు అందించారు.

ఈ కార్యక్రమం టీవీలో ప్రసారం కావడం ఇదే తొలిసారి.

క్వీన్ ఎలిజబెత్ -2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, యువరాజు ఛార్లెస్ -3 రాజుగా బాధ్యతలు చేపట్టారు.


పాక్ కు అమెరికా యుద్ధ విమానాలు..బైడెన్ ఆమోదం:

పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల భారీ భద్రతా సాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్ 16 ఫైటర్ జెట్లను అందించనుంది.

నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది.

450 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఎఫ్ 16 యుద్ధ విమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రతిపాదన విక్రయం గురించి కాంగ్రెస్ కు తెలిపింది.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం లో తమకు పాక్ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది.

ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతా పరమైన సమతౌల్యానికి ఎలాంటి హానీ ఏర్పడదని చెప్పింది.

2018 లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని నిలిపివేశారు.

ఆఫ్గాన్ తాలిబన్లు, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్ర గ్రూపులను నిలువరించడంలో విపలమవుతుందంటూ ఆ సహకారాన్ని ఆపేశారు.


=========================

జాతీయం

అంతర్జాతీయ వేదికపై మెరిసిన వరంగల్:

అంతర్జాతీయ వేదికపై వరంగల్ ఖ్యాతిని సంపాదించింది.

యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌కు ఎంపికైంది.

44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపు ఇవ్వగా భారతదేశం నుంచి 3 నగరాలు సెలక్టయ్యాయి. అవి వరంగల్, కేరళలోని త్రిశూర్, నీలాంబుర్ నగరాలు.

యునెస్కో అనుబంధ సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఒకటి.

ముక్కు ద్వారా ఇన్ కొవ్యాక్ వ్యాక్సిన్:

కొవిడ్ నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ఇన్ కొవ్యాక్ (బిబివి154)కు మన దేశంలో అత్యవసర వినియోగ అనుమతి లభించింది.

ఈ వ్యాక్సిన్ ను ముక్కు ద్వారా వేస్తారు.

ఇలాంటి కొవిడ్ - 19 టీకా రావడం ఇదే తొలిసారి.

భారత్ బయోటెక్ తాజా ఆవిష్కరణతో ఈ అరుదైన ఘనత భారతదేశానికి దక్కింది.

ఇన్ కొవ్యాక్ ను 18 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.

దీనిపై మూడో దశల్లో క్లినికల్ పరీక్షలను చేశారు.

దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 3,100 మంది వాలంటీర్లపై ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

నూతన సహకార విధానం రూపకల్పనకు కమిటీ:

నూతన జాతీయ సహకార విధానం రూపకల్పన కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు.

అన్ని రాష్ట్రాలకు చెందిన 47 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు.

జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులకు ఇందులో స్థానం కల్పిస్తారు.

ప్రస్తుత విధానాన్ని 2002లో రూపొందించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాల్లో సుమారు 29 కోట్ల మంది సభ్యులున్నారు.

సహకారంతో సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అనువైన నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

తొలి దేశీయ విమాన వాహక నౌక ' ఐఎన్ఎస్ విక్రాంత్ ' :

దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ' ఐఎన్ఎస్ విక్రాంత్' లాంఛనంగా జలప్రవేశం చేసింది.

కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డులో నిర్వహించిన వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించారు.

భారత నైపుణ్యాలు, ప్రతిభకు ఈ నౌక సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి:

విస్తీర్ణం: రెండు ఫుట్ మైదానాల విస్తీర్ణం కలిగి ఉంది. మొత్తం 18 అంతస్తులున్నాయి.

పొడవు: 262.5 మీటర్లు

వెడల్పు: 62.5 మీటర్లు

బరువు: 42,800 టన్నులు

గరిష్ట వేగం: 28 నాట్ లు

కంపార్ట్ మెంట్లు: 2,200

మొహరించె హెలికాప్టర్లు, విమానాల సంఖ్య: 30.

నౌకాదళానికి సరికొత్త పతాకావిష్కరణ:

నౌకాదళానికి కొత్త పతాకాన్ని మోడీ ఆవిష్కరించారు. ఇన్నాళ్లూ నౌకాదళం జెండాలో బానిసత్వపు ఆనవాళ్లుండేవి.

ఇకనుంచి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో సముద్రజలాల్లో, ఆకాశంలో కొత్త పతాకం ఎగురుతుంది. ఈ పతాకాన్ని శివాజీకి అంకిత మిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

నూతన జండా గురించి:

కొత్త పతాకంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి.

ఎడమవైపు పై భాగంలో భారత జాతీయ జెండాను ఉంచారు.

కుడి వైపున నీలం, బంగారు వర్ణంలో మెరిసిపోయే అష్టభుజాకారం ఉంది.

అష్టభుజాకారంలో 2 బంగారు వర్ణ బార్డర్లున్నాయి.

వాటి లోపల నీలం రంగు మధ్యలో నౌక లంగరు ఆకృతిపై నిల్చున్నట్లుగా జాతీయ చిహ్నం ఉంది.

కింది భాగంలో నౌకాదళ నినాదం 'సమ్ నో వరుణ:' అనే నినాదం దేవనాగరి లిపిలో ఉంది.

సమ్ నో వరుణ: అంటే వరుణ దేవ మాకు శుభం కలిగించు అని అర్థం వస్తుంది.

అష్టభుజాకారం చుట్టూ ఉన్న బంగారు బార్డర్లను శివాజీ రాజముద్ర నుంచి గ్రహించారు.

పతాకంలోని తెలుపురంగు నౌకాదళంలోని నౌకలు, నిర్మాణాలు, ఇతర సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న భారత్:

బ్రిటన్ ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (854.7 బిలియన్ డాలర్లు)గా తాజాగా అవతరించిన భారత్ 2029 నాటికల్లా మూడో స్థానానికి చేరుతుందని ఎస్ బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది.

2027లో జర్మనీని, 2029 లో జపాన్ ను అధిగమించే సూచనలున్నాయని పేర్కొంది.

ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.

స్వాతంత్రం పొందిన 75 ఏళ్ల తర్వాత భారత్ ఈ విజయం సాధించింది.

అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్ ముందున్నాయని ఐఎంఎం అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

గతంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ ర్యాంకులో ఉంది.

99 శాతం భారతీయలు పీల్చేది కలుషిత వాయువే:

దేశంలో 99 శాతం ప్రజలు నిత్యం కలుషిత వాయువును పీలుస్తున్నట్లు గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో వెల్లడైంది.

డబ్ల్యూహెచ్ వో రూపొందించిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం 2.5 ఆధారిత వార్షిక ఆరోగ్య మార్గదర్శకాలను మించి ఐదు రెట్లు ఉందని పేర్కొంది.

గ్రీన్ పీస్ ఇండియా రూపొందించిన డిఫెరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై పేరిట విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.

దేశంలో 62 శాతం మంది గర్భిణిలు అత్యంత కాలుష్య పూరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది.

నివేదిక వార్షిక సగటు పీఎం 2.5 కాలుష్య ఎక్స్ పోజర్ విశ్లేషణ మేరకు దేశంలో అత్యంత కాలుష్యానికి గురయ్యేది ఢిల్లీ ప్రాంతమని పేర్కొంది.

=========================

రాష్ట్రాలు

ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది.

పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది.

నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె.సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఏపీ రాష్ట్రానికి అవార్డు ఎంపిక చేశారు.

తెలంగాణలో వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజ్ ఏర్పాటు:

దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజ్ (ఎడిఈఎక్స్) ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) ప్రకటించింది.

ఇండియా అర్బన్ డేటా ఎక్స్ఛేంజి (ఐయూడీఎక్స్)ని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖతో కలిసి ఇప్పటికే ఐఐఎస్ సీ ఏర్పాటు చేసింది.

పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉన్నట్లు తెలిపింది.

ఇదే రీతిలో ఏడీఈఎక్స్ ను రైతులకు అనేక సేవలందించే వేదికలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.

విత్తనాల లభ్యత, పంటల సాగుకు సలహాలు, సూచనలు, బీమా తదితర సేవలు దీని ద్వారా అందించాలని నిర్ణయించారు.

ప్రయోగాత్మకంగా 2023లో నిర్దేశిత సేవలను దీని ద్వారా అందించనున్నట్లు వెల్లడించింది.

నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గా జస్టిస్ చంద్రచూడ్:

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులయ్యారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించడం సంప్రదాయంగా కొనసాగింది.

సైకాప్స్ లో తెలంగాణకు మొదటి స్థానం:

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ - 2022లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది.

నిఘా విబాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐసెల్) రూపొందించిన సైకాప్స్ సాఫ్ట్ వేర్ టూల్ కు ఈ ఘనత దక్కింది.

ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి స్వాగత్ దాస్, తెలంగాణ సిఐ సెల్ ఎస్సీ దేవేందర్ సింగ్ కు బహుమతి అందించారు.

దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలోని ఉద్యోగుల బృందం ఈ సాఫ్ట్ వేర్ ని రూపొందించింది.

==============================

నియామకాలు:

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్:

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూయూ లిలిత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

జస్టిస్ లిలిత్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.

సీనియర్ న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ నియమితులయ్యారు.

74 రోజుల స్వల్ప కాలం మాత్రమే సిజేఐగా బాధ్యతలు నిర్వర్తించి..నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.

డీఆర్డీఓ చైర్మన్ గా సమీర్:

కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సమీర్ వి.కామత్ నియమితులయ్యారు.

ఇదే సమయంలో ఆయన్ను డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న జి. సతీష్ రెడ్డిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు శాస్త్ర సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.

ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కృష్ణమూర్తి:

కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారుడు కృష్ణ మూర్తి సుబ్రమణియన్, మన దేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల సంఘం ఈ నియామకాన్ని చేసింది.

ఈయన నవంబర్ 1 నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ప్రస్తుతం భారత్ నుంచి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డాక్టర్ సుర్జీత్ ఎస్. భల్లా వ్యవహరిస్తున్నారు.

నాబార్డ్ ఛైర్మన్ గా మహమ్మద్ ముస్తఫా:

నాబార్డ్ ఛైర్మన్ గా మహమ్మద్ ముస్తఫా ను నియమించాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూషన్స్ బ్యూరో సిఫార్సు చేసింది.

ముస్తఫా యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత ఛైర్మన్ గోవిందరాజులు స్థానంలో ముస్తఫా నియమించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed