- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మెడిసిన్ చదవాలనుకునే వారికి శుభవార్త
దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి.
రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 నాన్ మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణ మేరకు బి కేటగిరీలో ఉన్న 35% సీట్లలో 85% సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15% (168) సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడుతారు. ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనార్టీ కాలేజిలో 25% బి కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85% అంటే 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద చూపించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నిబంధనలు చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిషా, మధ్య ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో ఒక వైపు రిజర్వేషన్ లేక సొంత రాష్ట్రంలో, మరో వైపు అవకాశం లేక ఇతర రాష్ట్రాల్లోని సీట్లు పొందలేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారు. దీన్ని గుర్తించి, అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరెలా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 1,068 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఎంబీబీఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలు సహా, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే డాక్టర్ చదివేందుకు అవకాశాలు కలుగనున్నాయి.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఇక్కడ విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బి కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85% కు పెంచి, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ కావాలనే కలను రాష్ట్రం లోనే ఉండి చదివి సాకారం చేసుకోవాలనుకునే ఎంతో మంది విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పించింది.