‘ఆ రెండు రంగాల్లో మాత్రమే వృద్ధి’

by Harish |
‘ఆ రెండు రంగాల్లో మాత్రమే వృద్ధి’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పరిమితిలోనే కొనసాగుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను మైనస్ 6.4 శాతానికి సవరిస్తున్నట్టు కేర్ రేటింగ్స్ గురువారం వెల్లడించింది. మే నెలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 1.5 నుంచి 1.6 శాతం తగ్గుతుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. జులై నెలలోనూ లాక్‌డౌన్‌కు సంబంధించిన పలు ఆంక్షలు కొనసాగుతున్నందున, తిరిగి సాధాణ స్థితి మూడో త్రైమాసికంలో కానీ, నాలుగో త్రైమాసికంలో కానీ ఉండే అవకాశమున్నట్టు రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది.

ఈ పరిణామాల ప్రకారం..ప్రస్తుత జీడీపీ వృద్ధి మైనస్ 6.4 శాతం ఉందని కేర్ రేటింగ్స్ నివేదికలో తెలిపింది. వాస్తవ జీడీపీలో పతనం వల్ల నామమాత్రపు జీడీపీ కూడా ప్రభావితమవుతుందని, ఇది కేంద్ర ప్రభుత్వ అంచనా వేసిన ఆర్థిక లోటుపై ప్రభావం చూపనుందని నివేదికలో పేర్కొంది. కాగా, వ్యవసాయం, ప్రభుత్వ రంగాల నుంచే సానుకూల వృద్ధి ఉంటుందని కేర్ రేటింగ్స్ నివేదిక స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలు ప్రత్యేకమైనవి, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని బట్టి దేశంలో రికవరీ ప్రక్రియపై అంచనాలు మారుతూ ఉంటాయని వెల్లడించింది.

మూడో త్రైమాసికం చివరి నాటికి ఆర్థిక రంగాల్లో మూడింట రెండు వంతులు 50 నుంచి 70 శాతం సామర్థ్యంతో విస్తృతంగా పని చేస్తాయి. ఆతిథ్య, పర్యాటక, వినోదం, ప్రయాణ రంగాలు రానున్న త్రైమాసికంలో అంతరాష్ట్ర పరిమితులతో కొనసాగనుండటంతో సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని నివేదిక పేర్కొంది. ప్రజలకు లాక్‌డౌన్ పరిమితులు ఉండటంతో వస్తువులు, సేవలకు డిమాండ్ తగ్గుతుంది. ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోత వల్ల రానున్న పండుగ సమయాల్లో ఖర్చు చేయటానికి ప్రజలు ఆసక్తి చూపించరని కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story