‘బోర్డు’కు పైసల చిక్కులు..

by Shyam |
‘బోర్డు’కు పైసల చిక్కులు..
X

కంటోన్ మెంట్ బోర్డు నిధులు లేక డీలా పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంలో బోర్డు పగ్గాలు కేసీఆర్ సర్కార్ చేతిలోకి వెళ్లగా.. రావాల్సిన నిధులను ప్రభుత్వ ఖజానాకు మళ్లించుకుంటున్నారు. రూ. 100 కోట్ల వరకు బోర్డుకు చెల్లించాల్సి ఉంది. అయినా, పాలకమండలి నిధుల కోసం గవర్నమెంట్ ముందు అయ్యా అంటూ చేతుల చాపాల్సి వస్తున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు రూ. 600 కోట్ల వరకూ బకాయి పడింది.

దిశ, కంటోన్ మెంట్:

కంటోన్​మెంట్ బోర్డు నిర్వీర్యం దిశగా పయనిస్తోంది. నిధుల సమస్య వెంటాడుతోంది. పాలక మండలి సభ్యుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో పల్చనబడింది. దీంతో కంటోన్​మెంట్​పై రాష్ట్ర ప్రభుత్వ అజామాయిషీ పెరిగిపోయింది. కాగా, నిబంధనల ప్రకారం రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ​ముందు మోఖరిల్లాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో టీపీటీ ద్వారా నేరుగా బోర్డు కు వచ్చే రాబడి, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఖజానాకు చేరుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సైతం ఏళ్ల తరబడి సర్వీస్ చార్జీలు ఇవ్వకుండా మొండికేస్తోంది. ఇలా నిబంధనలను పెడచెవిన పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉంచుతున్నాయి. దీంతో బోర్డులో ఏం చేయాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కరుణ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

దొందూ దొందే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొండి బకాయిలు ఎప్పుడు ఖజానాకు చేరుతాయా అని బోర్డు ఎదురుచూస్తోంది. కంటోన్​మెంట్ లోని ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ (టీపీటీ) నిధులు నేరుగా బోర్డుకు చెల్లించాల్సి ఉండగా, టీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత దాదాపు రూ.50 కోట్లకు పైగా రాష్ట్ర ఖాతాలోకే వెళ్లాయి. అదేవిధంగా కేంద్రం ఇచ్చే 13,14,15వ ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డు కు చెల్లించాల్సిన వాటాను సైతం రాష్ట్రం బోర్డుకు ఇవ్వడం లేదు. ఈ బకాయిలు దాదాపు రూ.27 కోట్లకు వరకు ఉంటాయి. కంటోన్ మెంట్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల నుంచి బోర్డుకు రావాల్సిన రూ.15 కోట్ల సర్వీసు చార్జీలను ఇవ్వడం లేదు.

జీఎస్టీ, వినోద పన్ను, వృత్తి పన్నులాంటి ఇతరాత్ర మార్గాల ద్వారా మరో రూ.10 కోట్లు వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తంగా రూ.100 కోట్ల వరకు కంటోన్ మెంట్ కు రావాల్సి ఉంది. బోర్డు ఆదాయానికి వేరే మార్గాలు లేవని ఇలాంటి గ్రాంట్లు, సర్వీస్ చార్జీల ద్వారానే మనుగడ సాగిస్తుందని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. నిధుల లేమి వల్ల అభివృద్ది కుంటుపడుతుందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని బోర్డు యంత్రాంగం కోరుతూ వస్తోంది. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, గత జూలై 2న బోర్డు పాలక మండలి సభ్యులు, అధికారులను తీసుకెళ్లి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. సమావేశంలో కంటోన్ మెంట్ బోర్డుకు పేరుకుపోయిన బకాయిలను నెల నెలా రూ.10 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ నెరవేర్చలేకపోయారు.

కేంద్రం మరీ దారుణం..

దేశంలోనే అతిపెద్ద కంటోన్ మెంట్ బోర్డు పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. బోర్డు అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మిలటరీ స్థావరాలు, కార్యాలయాల నుంచి కంటోన్ మెంట్ కు రావాల్సిన సర్వీస్ చార్జీలను చెల్లించడం లేదు. సర్వీస్ చార్జీల రూపేణా కేంద్రం బోర్డుకు రూ.600 కోట్ల బకాయిలు పడింది. కనీసం వీటిలో మొదటి విడుతలో రూ.100 కోట్లు అయినా చెల్లించాలని కేంద్రం ముందు సాగిలా పడినా కణికరించడం లేదు.

బకాయిలు కాకుండా అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం రూ.99 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని బోర్డు రెండేళ్లుగా విజ్ఙప్తులు చేస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తోంది. బోర్డు యంత్రాంగం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే దశల వారీగా బకాయిలు విడుదల అయ్యేవని, పాలక మండలి ఆశించిన స్థాయిలో సర్వీస్ చార్జీల కోసం ప్రయత్నాలు చేయడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కంటోన్ మెంట్ బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిధుల లేమీతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల బోర్డు ఖజానాను ఖాళీ చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వచ్చిందని బోర్డు కీలక అధికారి ఒక్కరు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed