తమ జాతిని చంపుతున్న ధ్రువపు ఎలుగుబంట్లు, కారణం?

by Shyam |
తమ జాతిని చంపుతున్న ధ్రువపు ఎలుగుబంట్లు, కారణం?
X

దిశ, వెబ్‌డెస్క్ :
తెల్లని మంచు ముద్దల్లో, మెరుస్తున్న ధవళ వర్ణ వెంట్రుకలతో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కలియతిరిగే ధ్రువపు ఎలుగుబంట్లు ఇప్పుడు ఒకదాన్ని మరొకటి చంపుకుని స్థాయికి చేరుకున్నాయి. ఇందుకు ప్రధానం కారణం వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలు. ప్రస్తుతం ఆర్కిటిక్ ధ్రువం వద్ద పరిశోధనలు చేస్తున్న రష్యన్ శాస్త్రవేత్తలకు వేరొక ధ్రువపు ఎలుగు బంటిని చంపి తింటున్న ఎలుగుబంట్లు రోజూ కనిపిస్తున్నాయి. వారు తీసి పంపిన ఫొటోలు ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను ఆలోచనలో పడేస్తున్నాయి.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ మార్పులు ఏర్పడి ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. అంతేకాకుండా ముడిచమురు వెలికితీత పేరుతో పెద్ద పెద్ద కంపెనీలు ఆర్కిటిక్ వద్ద ప్లాంటులు కట్టేసి మంచును తవ్వేస్తున్నాయి. ఆ ప్లాంట్లలో పనిచేయడానికి వచ్చిన మనుషుల కారణంగా ధ్రువపు ఎలుగుబంట్ల సహజ జీవనం తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో మంచు ముద్దల కింద ఈత కొట్టే సీల్ చేపలను వేటాడి తిని బతికే ఈ ధ్రువపు ఎలుగుబంట్ల ఆహారానికి ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా అవి ఒడ్డు ప్రాంతాల్లో వేటాడాల్సి వస్తోంది. అక్కడ సరిపడినంత ఆహారం ఉండదు. ఇక చేసేది లేక తోటి ఎలుగుబంట్ల మీద దాడి చేసి చంపి తింటున్నాయి.

బలంగా మగ ఎలుగుబంట్లు.. బలహీనంగా ఉన్న ఆడ ఎలుగుబంట్లను, పిల్ల ఎలుగుబంట్లను చంపుతున్నాయి. కొన్ని సార్లు తల్లి ఎలుగుబంటి కూడా పిల్ల ఎలుగుబంట్లను చంపి తినేస్తోంది. నిజానికి ధ్రువపు ఎలుగుబంట్లు ఒకదానిని ఒకటి తింటాయని ముందు నుంచి తెలుసు. అలాంటి సంఘటనలు అరుదుగా కనిపించేవి. కానీ ఇప్పుడు చాలా తరచుగా కనిపించడం కొంత ఆందోళనకు గురి చేస్తోందని రష్యన్ శాస్త్రవేత్త మార్డొవింట్సేవ్ తెలిపారు. గడచిన 25 ఏళ్లలో ఆర్కిటిక్ వద్ద 40 శాతం కంటే ఎక్కువ మంచు తగ్గిపోయిందని అన్నారు.

ఆర్కిటిక్ వద్ద సాధారణంగా ధ్రువపు ఎలుగుబంట్లు వేటాడే ప్రాంతమైన గల్ఫ్ ఆఫ్ ఓబ్ ఇప్పుడు ఎల్ఎన్‌జీ గ్యాస్ తరలించే ఓడలకు విశ్రాంత స్థావరంగా మారింది. దీంతో అవి ఒడ్డు వైపుగా తరలి వెళ్తున్నాయని మార్డోవింట్సేవ్ అన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ధ్రువపు ఎలుగుబంట్లు పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed