దుబ్బాకలో జోరుగా సోషల్ మీడియా వార్

by Shyam |
దుబ్బాకలో జోరుగా సోషల్ మీడియా వార్
X

దిశ ప్రతినిధి, మెదక్: ఎన్నికలంటేనే నాయకుల హడావుడి, మైకులు, ఫ్లెక్సీలు గల్లీగల్లీలో ఇదే తంతు అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం కొవిడ్ కారణంగా భారీ బహిరంగ సభలు నిర్వహించకూడదన్న ఈసీ నిబంధనల మేరకు అభ్యర్థులు తమ ప్రచార సరళిని మార్చుకున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఉప పోరులో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు మాటల తూటాలతో రెచ్చిపోతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు కూడా సభలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రధాన పార్టీల నాయకులు సామాజిక మాధ్యమాలనే నమ్ముకొని ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లు చేస్తూ, వాట్సాప్ స్టేటస్‌లు పెడుతున్నారు. వైరలవుతున్న పోస్టులతో ఉచిత ప్రచారం పొందుతున్నారు. అయితే ప్రచారంలో వచ్చిన కొత్త ట్రెండ్‌తో ఫ్లెక్సీ, బ్యానర్ల షాపులు గిరాకీ లేక దివాళా తీస్తున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని ప్రధాన పార్టీల నేతలకు ఎవరికివారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రతి ఒక్కరికీ తమ వైయిస్ వినిపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే అన్ని పార్టీలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నుండి ఏ ఒక్క నాయకుడు సొంత పార్టీ తరఫున పొరబాటున తప్పుగా మాట్లాడితే చాలు ప్రత్యర్థి పార్టీ దాన్ని క్యాచ్ చేసుకొని వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. అలాగే గతంలో ప్రత్యర్థి ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు తీరు, ప్రస్తుతం ఇస్తున్న వాగ్దానాలను ఓటర్లకు సులువుగా అర్థమయ్యే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు.

ఆయా పార్టీల పోస్టులు వైరల్..

టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు బీజేపీని టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండగా, బీజేపీ సైతం కేంద్రంలో నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ లొసుగులను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధానంగా వైరల్ అయిన పోస్టులను పరిశీలిస్తే..

. ఆయా పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు అయిన నాటి నుండి వారి విద్యార్హతలు, బలాలు, బలహీనతలు లాంటి పోస్టు వైరల్ అయ్యాయి.
. టీఆర్ఎస్ ఇటీవల ఒక గ్రామంలో మురుగు కాల్వను ప్రారంభించిన రెండు రోజులకే కూలిపోయిందంటూ చేసిన పోస్టు వైరల్ అయింది.
. వారం రోజుల కిందట బీడీ కార్మికులకు ఇస్తున్న పింఛన్లలో రూ.1600 కేంద్రమే ఇస్తుందని బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అయితే దీనికి దీటుగా మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టి బీడీ కార్మికులకు ఇస్తున్న ఫింఛన్లలో కేంద్రం ఇస్తున్నది రూ.1600 వాస్తవమని నిరూపిస్తే తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు వెంటనే రాజీనామా చేస్తానని, నిరూపించలేకుంటే బీజేపీ నుంచి బండి సంజయ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి ప్రాణాలర్పిస్తే తల్లి శంకరమ్మకు ఎందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదంటూ బీజేపీ నాయకులు పెట్టిన పోస్టు కూడా ఎక్కువ మందికి చేరింది.
. అర్ధరాత్రి వేళ పోలీసుల హైడ్రామా అంటూ బీజేపీ నాయకుల కారును ఎంసీసీ టీం చెక్ చేసిన వీడియో అయితే చాలా మందిని చేరుకుంది.
. బీజేపీ పార్టీ రైతుల మోటార్లకు మీటర్లు పెడుతుందట అని టీఆర్ఎస్ నాయకులు పెట్టిన పోస్టు వైరల్ అయింది.
. గత గురువారం నిజామాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని చేతనైతే మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో రాజీనామా చేసి దుబ్బాకలో పోటీ చేయాలని మాట్లాడగా, ‘ఏదో గాల్లో గెలిచిన నువ్వు నువ్వు.. నా గురించి మాట్లాడుతున్నావా? నాకు రాజీనామా చేయడం కొత్తేమి కాదు. ఉద్యమ సమయంలో నేను రాజీనామా చేసిన ప్రతిసారి భారీ మెజార్టీతో గెలిచా. నీకు దమ్ముంటే నిజమాబాద్‌లో రాజీనామా చేసి గెలువు’ అని మంత్రి ప్రతి సవాల్ విసిరిన వీడియో సైతం వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. ఇలా ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శల వర్షం కురిపిస్తూ, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్న పోస్టులో సోషల్ మీడియాలో నిండిపోతున్నాయి. అలాగే వైరల్ అవుతున్న పోస్టులతో ఉచిత ప్రచారం కూడా లభిస్తోందని నేతలు భావిస్తున్నారు. అందుకు సోషల్ మీడియాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తమ పార్టీ గెులుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

లైవ్‌లు.. స్టేటస్‌లు

కొవిడ్-19 కారణంగా పార్టీ సమావేశాలకు ఎక్కువగా జనం రావడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు జనం తక్కువగా ఉండటంతో వారు చెప్పే ప్రసంగం అందరికీ చేరడం లేదని భావించిన అభ్యర్థులు, పార్టీల నాయకులు కొత్త రకం సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు తమ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ఫేసుబుక్, ఇన్‌స్టాగ్రాంల్లో లైవ్ పెడుతూ, వాట్సాప్‌లో స్టేటస్‌లు పెడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా వారు చెప్పాలనుకున్న ఎన్నికల ప్రచారం అందరికీ చేరేలా చూస్తున్నారు.

మూతబడిన ఫ్లెక్సీ షాపులు..

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఫ్లెక్సీ, బ్యానర్ షావులు, ఫొటో షావులకు బాగా గిరాకీ ఉండేది. టెక్నాలజీ మారింది. మెగా ఫిక్సెల్ సాంకేతికత కల్గిన సెల్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఇక ఫ్లేక్సీ, బ్యానర్లతో పనిలేకుండా పోయింది. దానికి తోడు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎక్కువ ప్రధాన్యత సోషల్ మీడియాకే ఇస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నికలప్పుడు బిజీబిజీగా ఉండే బ్యానర్, ఫ్లెక్సీ షాపులన్నీ ఇప్పుడు గిరాకీ లేక దివాళా తీస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed