‘నెగెటివ్’పైనే ఫోకస్..!

by Shyam |
‘నెగెటివ్’పైనే ఫోకస్..!
X

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం రోజుకో కొత్త రూపం తీసుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెలకొన్న ముక్కోణపు పోటీలో విమర్శలు, తిట్లు, సవాళ్లు, ప్రతిసవాళ్లు జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీపైన మరో పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. గెలిస్తే నియోజకవర్గానికి చేసే అభివృద్ధి పనులు, హామీల కంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలవడం ద్వారా జరిగే నష్టాన్ని ఎత్తిచూపడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. అభ్యర్థుల అసమర్థతను, బలహీనతలను ఒకరినొకరు ఎత్తిచూపుకుంటున్నారు. అన్ని పార్టీలదీ అదే తీరు. గతంలో ఎన్నడూ కష్టపడని తీరులో ముగ్గురు అభ్యర్థులూ గెలుపుకోసం నానా పాట్లు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ దుబ్బాక ప్రచార వేడి కూడా బాగా పెరుగుతోంది. మూడు పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకూ ఉన్న బలహీనతలు ప్రజలకు అర్థమైపోయాయి. గతంలో ఏ ఉప ఎన్నికలోనూ లేనంత తీవ్రత దుబ్బాకలో కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు నిఘా వేస్తూ లోపాలను కనిపెట్టడానికి తగినంత శ్రమ పడుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాల నడుమ సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలు దేన్ని పరిగణనలోకి తీసుకుంటారో, ఎవరిని గెలిపిస్తారో ఆసక్తికరంగా మారింది.

ఆమెకు రాజకీయ చైతన్యం తక్కువ..

దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్) మృతితో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఆయన భార్య సుజాతకే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇప్పటివరకూ రాజకీయాలతో కనీస అనుభవం లేని ఆమెను గెలిపించుకోవడానికి మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై నడిపిస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి ఇప్పటివరకూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్లలో కూడా పెద్దగా మౌలిక సౌకర్యాలు సమకూరలేదని, ఇకపైన మూడేళ్లలో ఆ పార్టీ ఏం చేస్తుందని కాంగ్రెస్, బీజేపీలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుజాత ఒకవేళ గెలిచినా రాజకీయ చైతన్యం తక్కువ కావడంతో ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని, ఆమె గెలుపు ద్వారా ఒరిగేదేమీ ఉండదని, ప్రతీ అంశానికి హరీశ్‌రావు దగ్గరికి పరుగెత్తాల్సి వస్తుందని ఈ రెండు పార్టీల వాదన.

బీజేపీ అబద్ధాలను నమ్మితే నట్టేటా మునిగినట్లే..

అబద్ధాల ప్రచారంతో తప్పుదారి పట్టిస్తున్న బీజేపీని ఈ నియోజకవర్గ ప్రజలు నమ్మితే నట్టేటా మునుగుతారని, ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఈ నియోజకవర్గంలో కనిపించరని, హైదరాబాద్‌లోనే కూర్చుంటారని, ప్రజలకు ప్రయోజనం ఉండదని టీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తప్ప ఈ నియోజకవర్గంలో ఎన్నడూ కనిపించని రఘునందన్‌రావుకు ప్రజలతో అనుబంధం లేదని, వారి ఓట్లతో అక్కర మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. మాటలే తప్ప చేతల్లేని బీజేపీకి ఓటు వేస్తే నమ్మి మోసపోతారని ప్రజలను కోరారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థితో పెద్దగా పోటీయే లేదనే అభిప్రాయంతో ఉన్న టీఆర్ఎస్ స్థానిక నేతలంతా మూడవ స్థానమేననే అభిప్రాయానికి వచ్చేశారు.

బీజేపీ, టీఆర్ఎస్ దొందూ దొందే..

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులే ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయని కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్తూ ఉన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కారణంగా ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజల తరపున కోర్టులో పిటిషన్ వేస్తానని, న్యాయవాదిగా తానే వాదిస్తానంటూ అక్కడి నిర్వాసితులకు హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎందుకు వెనకడుగు వేశారని ప్రశ్నించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ నియోజకవర్గానికి రామలింగారెడ్డి చేసిందేమీ లేదని, ఆయనతో సన్నిహితంగా ఉన్న హరీశ్‌రావు తన నియోజకవర్గమైన సిద్దిపేటకు ఇచ్చిన ప్రాధాన్యతను ఏనాడూ దుబ్బాకకు ఇవ్వలేదన్నారు. ఇకపైన మూడేళ్ళలో ఏదో చేస్తామని నమ్మిస్తున్నారని, ఏడేళ్ళలో ఒరిగిందేంటో చూసి ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు.

ఇలా మూడు పార్టీలూ ప్రత్యర్థి పార్టీల లోపాలు, బలహీనతలు, వైఫల్యాన్ని ఎత్తిచూపడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. నిర్దిష్టంగా ఈ నియోజకవర్గంలోని లోపాలు, వాటిని భర్తీ చేయడానికి ఇకపైన చేపట్టనున్న కృషి తదితరాలపై మాత్రం అభ్యర్థులు పెద్దగా నొక్కిచెప్పడంలేదు. ఇప్పుడు ప్రజలు ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలో వారి బలహీనతలను బేరీజు వేసుకుని నిర్ణయించుకునే పరిస్థితులను ఆ పార్టీలే సృష్టించుకున్నాయి. ఎవరు ఎక్కువ బలహీనులు, అసమర్థులు, చిత్తశుద్ధిలేనివారు, ప్రజలకు అందుబాటులో లేనివారో అంచనా వేసుకుని ఈ ముగ్గురిలోనే ఒకరిని ఎంచుకోవాలనే సందేశం ఈ ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది.

Advertisement

Next Story