వ‌ణుకుతున్న ఢిల్లీ.. జులై 31 నాటికి 5.5 ల‌క్ష కేసులు!

by vinod kumar |   ( Updated:2020-06-09 04:59:54.0  )
వ‌ణుకుతున్న ఢిల్లీ.. జులై 31 నాటికి 5.5 ల‌క్ష కేసులు!
X

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. కోవిడ్-19 మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జా వ‌ణికిపోతున్నారు. రోజురోజుకూ అక్క‌డ కరోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే 30 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. 874 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త స్థాయి స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిపోడియా, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్, విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారులు హాజ‌ర‌య్యారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 15వ తేదీ నాటికి 44 వేల కేసుల‌కు చేరువ‌వుతామ‌ని, 6,600 బెడ్లు అవ‌స‌రం ప‌డతాయ‌న్నారు. జూన్ 30 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరుతుందన్నారు. అప్పుడు 15,000 ప‌డ‌క‌లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. జూలై 15 నాటికి కేసుల సంఖ్య 2.25 ల‌క్ష‌ల‌కు చేరే అవ‌కాశం ఉంద‌న్నారు డిప్యూటీ సీఎం. జులై చివ‌రి నాటికి క‌రోనా కేసులు.. 5.5 ల‌క్ష‌లు దాటిపోతాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. మొత్తంగా ఆ స‌మ‌యం వ‌ర‌కు 80 వేల బెడ్లు అవ‌స‌రం ఉంటుంద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే ఢిల్లీలో వైర‌స్ క‌మ్యూనిటీ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు దానిపై చ‌ర్చించాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌నీష్ సిపోడియా అన్నారు.

Advertisement

Next Story