రూ. 75 వేల మార్కు దాటిన పసిడి

by S Gopi |
రూ. 75 వేల మార్కు దాటిన పసిడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో పరిగెడుతున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్ఠాలకు చేరిన పసిడి ధరలను చూసి సామాన్యులు కొనేందుకు జంకుతున్నారు. తాజాగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ రూ. 75,000 మార్కును దాటేసింది. శుక్రవారం ఒక్కరోజే పసిడి ధరలు రూ. 1,090 పెరిగాయి. దీంతో సాయంత్రానికి స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం అన్ని రకాల పన్నులు కలుపుకుని రూ. 75,545కి చేరింది. ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 1,000 పెరిగి రూ. 67,200గా ఉంది. వెండి సైతం దేశీయంగా కిలో రూ. 1,500 పెరిగి రూ. 90,000కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు మారుతుండటంతో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే పశ్చిమాసియాలోని సిరియాలో రాయబార కార్యాలయంపై దాడి నేపథ్యంలో ప్రతికారంగా ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల మద్య పెట్టుబడిదారులు సురక్షిత సాధనాలకు మారేందుకు పసిడిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఆ ప్రభావం మన దేశంలో బంగారంపై కూడా పడటంతో ధరలు పెరుగుతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సైతం ఔన్స్ బంగారం ధర 2,388 డాలర్లతో రికార్డు గరిష్ఠాల వద్ద ఉంది.

Advertisement

Next Story