పదకొండు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!

by Naresh |
పదకొండు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
X

న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఆగష్టులో పదకొండు నెలల కనిష్ఠ స్థాయి 12.41 శాతానికి దిగొచ్చింది. ఆహార పదార్థాలు, తయారీ ఉత్పత్తుల ధరలు దిగిరావడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ వరుసగా 17వ నెల కూడా రెండంకెలపైనే ఉండడం గమనార్హం. అంతకుముందు జూలైలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 13.93 శాతంగా, గతేడాది ఆగష్టులో 11.64 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మేలో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి చేరుకున్న తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మినరల్ ఆయిల్స్, ఫుడ్ ఆర్టికల్స్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, బేసిక్ మెటల్స్, కెమికల్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్, విద్యుత్, ఆహార పదార్థాల ధరలు గత నెలలో పెరిగాయి. ఆహార పదార్థాలకు సంబంధించి టోకు ధరల ద్రవ్యోల్బణం 12.37 శాతానికి పెరిగింది. ఆగస్టులో కూరగాయల ధరలు 22.29 శాతం పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. తయారీ వస్తువుల విభాగం 7.51 శాతంగా ఉంది. ఇక, సమీక్షించిన నెలలో ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం జూలైలో 43.75 శాతం నుంచి 43.75 శాతం నుంచి 33.67 శాతానికి తగ్గింది. కాగా, ఇటీవల విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో ఆగష్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఎనిమిదో నెలా ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎక్కువగా 7 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story