Packaged Food, Spice వ్యాపారంలోకి అడుగు పెట్టిన Wipro Consumers!

by Harish |   ( Updated:2022-12-19 12:29:18.0  )
Packaged Food, Spice వ్యాపారంలోకి అడుగు పెట్టిన Wipro Consumers!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్యాకేజ్డ్ ఫుడ్, స్పైస్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. అత్యధికంగా అమ్ముడయ్యే కేరళ ఫుడ్ బ్రాండ్ నిరపరాను కొనుగోలు చేయడం ద్వారా ఈ విభాగంలో ప్రవేశించినట్టు కంపెనీ తెలిపింది. దీని ద్వారా స్నాక్ ఫుడ్, మసాలాలు, రెడీ-టు-కుక్ విభాగాల మార్కెట్‌లో గణనీయమైన వాటాను దక్కించుకోవాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు విప్రో కన్స్యూమర్ పేర్కొంది.

నిరపరా బ్రాండ్‌తో ఒప్పందానికి సంబంధించి ఎంత మొత్తం వెచ్చించినది కంపెనీ వెల్లడించలేదు. నిరపరాతో ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం జరిగింది. ఈ కొనుగోలు ద్వారా విప్రో సంస్థ ఇప్పటికే మసాలాల మార్కెట్లో ఉన్న డాబర్, ఇమామి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ వంటి సంస్థల సరసన చేరింది. నిరపరా బ్రాండ్ మిశ్రమ మసాలాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా నిరపరా బ్రాండ్ అప్పం, ఇడియప్పం వంటి ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే బియ్యం పొడి ఉత్పత్తిలో ప్రాచూర్యం కలిగి ఉంది.

నిరపరాను కొనుగోలు చేయడం ద్వారా మసాలా దినుసులు, రెడీ-టు-కుక్ విభాగంలో మాకు మరింత పట్టు లభించినట్టు అయిందని విప్రో కన్స్యూమర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ చెప్పారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ దేశీయ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ సంస్థగా ఉంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,630 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో హోమ్‌కేర్, వెల్‌నెస్, ఎలక్ట్రిక్ వైర్ పరికరాలు, డొమెస్టిక్-కమర్షియల్ లైటింగ్ సహా పలు రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Advertisement

Next Story