VI: ఏజీఆర్ బకాయిలపై ప్రభుత్వంతో వోడాఫోన్ ఐడియా కొత్త చర్చలు

by S Gopi |
VI: ఏజీఆర్ బకాయిలపై ప్రభుత్వంతో వోడాఫోన్ ఐడియా కొత్త చర్చలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) తన ఏజీఆర్ బకాయిలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ సీఈఓ అక్షయ మూంద్డా సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు. అయితే, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వంతో జరిగే చర్చల వల్ల వొడాఫోన్ ఐడియా దీర్ఘకాల వ్యాపార ప్రణాళికలు, పునరుద్ధరణపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గతవారం కంపెనీ ఏజీఆర్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వీఐ పిటిషన్‌లను తిరస్కరించిన నేపథ్యంలో కంపెనీ ప్రభుత్వంతో చర్చించింది. దీనిపై స్పందించిన సీఈఓ.. నిధుల సేకరణకు సంబంధించి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, రాబోయే 2 నెలల్లో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, ఏజీఆర్ వ్యవహారం, కంపెనీ ప్రణాళికలు వేర్వేరు అంశాలు, ఏజీఆర్ బకాయిల విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరించామని అక్షయ మూంద్డా పేర్కొన్నారు. కంపెనీలో ప్రభుత్వానికి అత్యధికంగా 23 శాతం వాటా ఉందని ఆయన ప్రస్తావించారు. కాగా, వొడాఫోన్ ఐడియా తన ఏజీఆర్ బకాయిలను రూ. 21,533 కోట్లు అని అంచనా వేయగా, టెలికాం విభాగం దాన్ని రూ. 58,254 కోట్లుగా అంచనా వేసింది. ఇప్పటివరకి వీఐ కేవలం రూ. 7,900 కోట్లను మాత్రమే చెల్లించింది.

Advertisement

Next Story