BSNL 5G: Airtel, Jioకు బిగ్‌షాక్.. BSNL నుంచి 5G.. వీడియో కాల్ సక్సెస్

by Harish |
BSNL 5G: Airtel, Jioకు బిగ్‌షాక్.. BSNL నుంచి 5G.. వీడియో కాల్ సక్సెస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికా కంపెనీ బీఎస్‌ఎన్ఎల్ నుంచి త్వరలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని పరీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. బీఎస్‌ఎన్ఎల్ ద్వారా కేంద్ర మంత్రి 5జీ ఎనేబల్డ్‌ వీడియో కాల్‌ చేశారు. దీనిలో మాటలు, వీడియో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే 5జీ విభాగంలో దూసుకుపోతుండగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్ఎల్ మాత్రం ఇంకా 4జీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తి స్థాయిలో విస్తరించలేకపోయింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 4జీ సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తన వినియోగదారులకు 5జీ సేవలు అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ ఏడాది బడ్జెట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు రూ.82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. దీని ద్వారా సంస్థ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని అందించేందుకు కృషి చేస్తుంది. ఇటీవల ప్రైవేట్ కంపెనీలు ఇష్టారీతుగా రీచార్జ్ ధరలను పెంచుతుండటంతో వినియోగదారులు క్రమంగా బీఎస్‌ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. గత 30 రోజుల్లో రెండు లక్షలకు పైగా కొత్త సిమ్‌లు యాక్టివేట్ అయ్యి సరికొత్త రికార్డు సృష్టించినట్లు బీఎస్‌ఎన్ఎల్ ఆంధ్ర ప్రదేశ్ విభాగం ప్రకటించింది. భారతదేశంలోని వివిధ టెలికాం సర్కిళ్లలో కూడా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకవేళ 4జీ, 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని బీఎస్‌ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అందించగలిగినట్లయితే చాలా మంది ప్రైవేట్ టెలికాం వినియోగదారులు బీఎస్‌ఎన్ఎల్‌కు మారే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story