Ultratech Cement: త్వరలో పెరగనున్న అల్ట్రాటెక్ సిమెంట్ ధరలు!

by Harish |
Ultratech Cement: త్వరలో పెరగనున్న అల్ట్రాటెక్ సిమెంట్ ధరలు!
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశపు అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ 2024 ద్వితీయార్థంలో సిమెంట్ ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. వర్షకాలంలో ధరల పెంపు జరిగే అవకాశం లేదని, వచ్చే త్రైమాసికంలో భారతదేశం అంతటా మొత్తం డిమాండ్ బలంగా ఉంటుందని ఆ సమయంలో ధరల్లో మార్పులు రావచ్చని అల్ట్రాటెక్ మేనేజ్‌మెంట్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రామీణ డిమాండ్ ఊపందుకోవడం, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్, అమరావతి, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో, అల్ట్రాటెక్ సిమెంట్ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (Q3FY25) వృద్ధి ఊపందుకోవచ్చని అంచనా వేస్తోంది.

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు విపరీతంగా కురుస్తుండటంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షాలు తగ్గిన వెంటనే కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఎన్నికలు కూడా ముగిసిపోవడం కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడటంతో దేశంలో పలు నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలు పెరుగుతున్నాయి. దీంతో 2024 ద్వితీయార్థంలో సిమెంట్‌కు డిమాండ్ బలంగా పెరుగుతుంది. అప్పుడు ధరల పెంపు ప్రతిపాదన ముందుకు రావచ్చని కంపెనీ అధికారులు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది క్రితం రూ.1,690 కోట్ల నుండి స్వల్పంగా రూ.1,695 కోట్లకు పెరిగింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల కారణంగా కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లడంతో నిర్మాణ కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయి. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక మందగమనంతో కొత్త ప్రాజెక్ట్‌లు ఆగిపోవడంతో సిమెంట్ రంగంలో ఆశించిన మేరకు ఆదాయాలు రాలేదు.

Advertisement

Next Story