ఈ వారం రూ. 1,325 కోట్లు సేకరించనున్న మూడు ఐపీఓలు

by S Gopi |
ఈ వారం రూ. 1,325 కోట్లు సేకరించనున్న మూడు ఐపీఓలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో ఐపీఓలు సందడి చేయనున్నాయి. మూడు కంపెనీలు రూ. 1,325 కోట్ల వరకు నిధులను పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించనున్నాయి. అందులో గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్‌కే స్వామి కంపెనీలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఐపీఓకు వస్తున్న కంపెనీలు మంచి లాభాలను సాధిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి. ఈ వారంలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతున్న కంపెనీల్లో.. రాజ్‌కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6-11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381-401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఇక, రూ. 423.56 కోట్ల వరకు నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రముఖ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ ఆర్‌కె స్వామీ 4-6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను సేకరించనుంది. షేర్ ధరను రూ. 270-288 మధ్య నిర్ణయించింది. జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5-7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210-221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది.

Advertisement

Next Story