అదానీ కంపెనీల్లో పెట్టుబడితో ఎల్ఐసీకి లాభాల పంట

by S Gopi |
అదానీ కంపెనీల్లో పెట్టుబడితో ఎల్ఐసీకి లాభాల పంట
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులతో భారీ లాభాలను సాధించింది. హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ షేర్లు పతనం నుంచి కోలుకోవడంతో ఎల్ఐసీ పెట్టుబడులు సైతం రికవరీ అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 59 శాతం పెరగడం గమనార్హం. గతేడాది ప్రారంభంలో హిండెన్‌బర్గ్ వ్యవహారంతో అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులతో రాజకీయంగా అనేక విమర్శలు, సందేహాలు మొదలయ్యాయి. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలపైనా ఆ సమయంలో అనుమానాలు తలెత్తాయి. దానివల్ల ఎల్ఐసీ నష్టాలు సుమారు పావు వంతుకు కరిగిపోయాయని కథనాలు, చర్చలు జరిగాయి. ఆ తర్వాత పరిణామాల్లో అదానీ స్టాక్స్ పుంజుకోవడంతో ఎల్ఐసీకి సైతం లాభాల పంట పండింది. 2023, మార్చి ఆఖరు నాటికి అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు రూ. 38,471 కోట్లుగా ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి అవి రూ. 61,210 కోట్లకు చేరాయి. గతేడాది విమర్శలు పెరగడంతో అదానీ కీలక కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌లలో ఎల్ఐసీ పెట్టుబడులను తగ్గించుకుంది కూడా. అయినప్పటికీ ఎల్ఐసీ అదానీ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా 59 శాతం లాభాలను దక్కించుకుంది.

Advertisement

Next Story