India Exports: జులైలో $23.5 బిలియన్లకు పెరిగిన వాణిజ్య లోటు

by Harish |   ( Updated:2024-08-15 15:41:22.0  )
India Exports: జులైలో $23.5 బిలియన్లకు పెరిగిన వాణిజ్య లోటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ వాణిజ్య లోటు జూన్ నెలలో నమోదైన 21 బిలియన్ డాలర్లతో పోలిస్తే జులైలో 23.5 బిలియన్ డాలర్లకు పెరిగిందని బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలలో వెల్లడైంది. ఇది 2023 ఏడాది జులై నెలలో 19 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024 ఏడాది జులైలో దేశ సరుకుల ఎగుమతులు 1.5 శాతం క్షీణించి 33.98 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 7.5 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దానికి ముందు జూన్‌లో ఎగుమతులు 2.6 శాతం పెరిగి 35.2 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 5.1 శాతం పెరిగి 56.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అదే జూన్ 2023లో ఎగుమతులు $34.39 బిలియన్లు, దిగుమతులు $53.49 బిలియన్లుగా ఉన్నాయి.

జులై 2024లో సేవల ఎగుమతులు $28.43 బిలియన్లు కాగా, దిగుమతులు $14.55 బిలియన్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికి భారత్ నుంచి ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుందని, రాబోయే రోజుల్లో కూడా ఇతర దేశాలకు ఎగుమతులు పెరుగుతాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు.

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు పెరుగుతున్న కారణంగా దేశంలో ఎలక్ట్రానిక్ ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయి. ఆఫ్రికాకు కూడా ఎగుమతులను పెంచడానికి అన్ని అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లు దాటగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story